Janasena: ఏపీ రాజకీయాల్లో ఎన్నికల హడావిడి కనిపిస్తోంది.. అభ్యర్థుల ఎంపిక దాదాపుగా పూర్తయ్యింది. జనసేన పార్టీ మాత్రం పెండింగ్‌లో ఉన్న రెండు సీట్లకు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తోంది. అయితే కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం పొత్తులో భాగంగా జనసేన పార్టీకి దక్కడంతో.. అక్కడ అభ్యర్థి ఎవరు అనే అంశంపై చర్చ జరుగుతోంది. జనసేన పార్టీ ఇద్దరు, ముగ్గురు అభ్యర్థుల పేరుతో సర్వేలు చేయించింది.. కానీ ఓ అంచనాకు రాలేకపోతోంది. ఈ క్రమంలో సరికొత్త ప్రచారం జరుగుతోంది. అభ్యర్థిని ఫైనల్ చేశారని.. టీడీపీ నుంచి జనసేన పార్టీలో చేరి టికెట్ దక్కించుకుంటారనే చర్చ నడుస్తోంది.
ఈ ఊహాగానాల నేపథ్యంలోనే పిఠాపురంలో పవన్ సమక్షంలో టీడీపీ సీనియర్ నేతలు మండలి బుద్ధప్రసాద్, నిమ్మక జయకృష్ణలు జనసేన పార్టీలో చేరారు. అవనిగడ్డ నుంచి కూటమి అభ్యర్థిగా మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ బరిలోకి దిగడం దాదాపు ఖాయమైపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పొత్తులో భాగంగా జనసేనకు అవనిగడ్డ స్థానం కేటాయించడంతో సరైన అభ్యర్థిని బరిలోకి దింపాలని పవన్ గట్టిగా ప్రయత్నించారు. కొన్ని పేర్లు తెరపైకి వచ్చినా చివరికి మండలివైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. అవనిగడ్డ నుంచి గతంలో 1999, 2004, 2014లో మూడుసార్లు మండలి బుద్ధప్రసాద్ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయనకు టికెట్ ఇస్తేనే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని జనసేన భావించినట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున పాలకొండ నుంచి నిమ్మక జయకృష్ణ పోటీ చేశారు. జనసేన తరపున అవనిగడ్డ నుంచి మండలి బుద్ధప్రసాద్, పాలకొండ నుంచి నిమ్మక జయకృష్ణ పోటీ చేయడానికి లైన్ క్లియర్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. వీరి పోటీ గురించి అధికారిక ప్రకటన రాావాల్సి ఉంది.
Read Also: Margani Bharat: కుట్ర చేసి పింఛన్లు ఆపారు.. ఇంటికి తీసుకెళ్లి ఇస్తే తప్పేంటి..?
అవనిగడ్డలో జరుగుతున్న కీలక పరిణామాల నేపథ్యంలో ఆరు మండలాల జనసేన నేతలు, క్యాడర్ సమావేశమయ్యారు. టికెట్ టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే బుద్ధ ప్రసాద్‌కి ఇస్తున్నారన్న ప్రచారంపై సమావేశం నిర్వహించారు. ఈ సీటు జనసేనకు ఇస్తే గెలవదు అని రాజీనామాలు చేసిన టీడీపీ నేతల వ్యాఖ్యలపై జన సేన నేతలు ఫైర్ అయ్యారు. టికెట్ బుద్ధ ప్రసాద్ కు ఇచ్చిన తర్వాత ఏం చేయాలనే దానిపై చర్చించారు. అవనిగడ్డ సీటు జనసేన పార్టీ వారికే ఇచ్చేలా పోరాటం చేద్దామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ జనసేన నేతలు, కేడర్‌కు సూచించారు. పవన్‌పై నమ్మకం ఉందన్నారు. వేరే పార్టీల వారు టికెట్ ఆశించవచ్చు.. వేరే పార్టీల వారికి టికెట్ ఇచ్చే ఆలోచన పవన్ చేయరు అని నమ్ముతున్నామన్నారు.