TDP Politburo Meeting: నేడు టీడీపీ పొలిట్‌బ్యూరో కీలక భేటీ.. మహానాడు ఏర్పాట్లపై ప్రధాన చర్చ

Tdp

tdp

TDP Politburo Meeting: తెలుగుదేశం పార్టీ (టీడీపీ) పొలిట్‌బ్యూరో సమావేశం నేడు ఉదయం 11 గంటలకు జరగనుంది. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో నిర్వహించనున్న ఈ కీలక సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్‌తో పాటు పలువురు పొలిట్‌బ్యూరో సభ్యులు హాజరుకానున్నారు. అయితే టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని తన నివాసం నుంచి వర్చువల్ విధానంలో ఈ సమావేశం పాల్గొననున్నారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణ, ముఖ్య రాజకీయ అంశాలు, అలాగే మహానాడు నిర్వహణపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించనున్నట్లు సమాచారం.

ఈ నెలాఖరులో వర్చువల్ విధానంలో నిర్వహించనున్న మహానాడుకు సంబంధించిన ఏర్పాట్లు, కార్యాచరణ ప్రణాళిక, ఆమోదించాల్సిన తీర్మానాలు, విడుదల చేయనున్న ప్రకటనలు వంటి అంశాలు ప్రధాన అజెండాగా టీడీపీ పొలిట్‌ బ్యూరో సమావేశం జరగనుంది.. పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలపై చేపట్టాల్సిన కార్యక్రమాలు, రాజకీయ వ్యూహాలపై కూడా పొలిట్‌బ్యూరోలో చర్చ జరిగే అవకాశముంది. ఇటీవల రాజకీయ పరిణామాల నేపథ్యంలో జరుగుతున్న ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. మహానాడును విజయవంతంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పార్టీ నాయకత్వం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.