MP Sri Krishnadevarayalu: కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో టీడీపీ ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయలు భేటీ అయ్యారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్( NIPER) త్వరగా ఏర్పాటు చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి నడ్డాను కోరారు. నైపర్ సంస్థ గడచిన ఆరేళ్లుగా ఆగిపోయిందని.. దాన్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేసే విషయంపై ఎంపీ చర్చించారు. నైపర్ సంస్థకు భూమితో పాటు, అన్ని విధాలుగా సహకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. 30 వేల నుండి 40 వేల కోట్లు ఫార్మా ఎగుమతులు విశాఖ కేంద్రంగా జరుగుతున్నాయని కేంద్ర మంత్రికి తెలిపారు. వీటికి అనుగుణంగా నైపర్‌ని విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తే బాగుంటుందని కేంద్ర మంత్రికి చెప్పానని ఎంపీ వెల్లడించారు.
Read Also: AP Govt: ఏపీ సర్కారు కీలక నిర్ణయం.. నూతన క్రీడా పాలసీకి ఆమోదం
కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా సానుకూలంగా స్పందించారని ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయలు తెలిపారు. గల్ఫ్ దేశాలకు వెళ్లే వారికి చెయ్యాల్సిన ఆరోగ్య పరీక్ష కేంద్రాలను ఉత్తరాంధ్రలో కాని , రాయలసీమలో గాని ఏర్పాటు చేయాలని కోరామన్నారు. 10లక్షల జనాభాకు 100 మెడికల్ సీట్లు అనే నిబంధనను సవరించి రాష్ట్రంలో మెడికల్ సీట్లు పెంచే విధంగా వెసులుబాటు ఇవ్వాలని కోరానన్నారు. పాత 13 జిల్లాలలో కాకుండా కొత్తగా ఏర్పడిన జిల్లాలలో క్రిటికల్ కేర్ యూనిట్లు ఏర్పాటు చేయాలని కోరామన్నారు. కేంద్రమంత్రి సుముఖంగా ఉన్నారని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతిపాదనలను సానుకూలంగా పరిశీలిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ సూచనల మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రిని కలిసామన్నారు.