Kesineni Nani: బెజవాడ పాలిటిక్స్‌లో ఎంపీ కేశినేని నాని వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిపోయింది.. అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలపై ప్రశంసలు కురిపిస్తున్న ఆయన.. సొంత పార్టీలోనే వ్యతిరేక కూడగట్టుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.. గతంలో.. కేశినేని సోదరుల మధ్య జరిగిన ఘటన నుంచి ఏదో ఒకటి జరుగుతూనే ఉంది.. ఇక, ఈ మధ్య వరుసగా.. తన ప్రత్యర్థి పార్టీ అయిన వైసీపీ ప్రజాప్రతినిధులను పొగిడేస్తున్నారు.. బాగా పనిచేస్తారని, సమస్యలు ఏవైనా వెంటనే పరిష్కారం చూపుతారంటూ ఆకాశానికి ఎత్తేశారు.. అయితే, స్థానికంగా ఉన్న టీడీపీ నేతలకు నాని వ్యాఖ్యలు మాత్రం మింగుడు పడడం లేదు.. ఈ నేపథ్యంలో.. మరోసారి బెజవాడ ఎంపీ కేశినేని నాని హాట్ కామెంట్లు చేశారు.. వచ్చే ఎన్నికల్లో అవసరమైతే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తా అన్నట్టు సంకేతాలు ఇస్తున్నారు ఈ టీడీపీ ఎంపీ.. రేపు ఏ పిట్టల దొరకు టికెట్ వచ్చినా నాకు ఇబ్బంది లేదన్న ఆయన.. ప్రజలందరూ కోరుకుంటే ఇండిపెండెంట్ గా గెలుస్తానేమో!? అని చెప్పుకొచ్చారు.
ఎన్నికల సమయంలోనే రాజకీయాలు తర్వాత కేవలం అభివృద్ధి మాత్రమే అన్నారు నాని.. ఒక పార్టీ ఎంపీ, మరో పార్టీ ఎమ్మెల్యే అభివృద్ది కోసం పని చేస్తే తప్పా అని ప్రశ్నించారు.. పార్టీలు, వ్యక్తులు ఎలా తీసుకున్నా నాకేం భయం లేదు.. పార్టీ టికెట్ ఇస్తుందా లేదా? మళ్ళీ ఎంపీ అవుతానా లేదా అనే భయం నాకు లేదు.. పదేళ్లు నేను చేసిన పని దేశంలో ఎవరు చేశారో చూపండి అంటూ చాలెంజ్ చేశారు. నాకు ట్రాక్ రికార్డ్ ఉంది.. ఐ యామ్ ప్రూవ్డ్ అన్నారు.. ఈ ప్రాంత అభివృద్ధికి ఢిల్లీ స్థాయిలో ఏదైనా చేయిస్తా.. పార్టీ ఐడియాలజీ కోసం ఫైట్ చేయాలి కానీ, ఈ పిచ్చి గోల ఏంటి? అని అసహనం వ్యక్తం చేశారు.. ఇవి పొలిటికల్ పార్టీలు కాదు రెండు వేదికలు మాత్రమే.. ఒక వేదిక మాది చంద్రబాబు నాయకుడు, మరో వేదిక వైసీపీ జగన్ నాయకుడు అని స్పష్టం చేశారు. జగన్, చంద్రబాబు విరోదంగా ఉన్నారు తప్ప మిగతా వాళ్ళెవరూ విరోధులు కాదన్న ఆయన.. నేను ఖచ్చితంగా ఈ ప్రాంత అభివృద్ధి, ప్రజల కోసమే పనిచేస్తా అన్నారు.. నా మైండ్ సెట్ కలిసే వ్యక్తులతో కలిసి పనిచేయడానికి నాకు ఏ పార్టీ ఐనా అనవసరం అని కుండబద్ధలు కొట్టారు కేశినేని నాని.
మరోవైపు కేశినేని నానితో కలిసి పని చేస్తామని, నాని పని తీరు ప్రశంసించారు మరో వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్.. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు తర్వాత కేవలం అభివృద్ది మాత్రమే.. ఎంపీ కేశినేని నాని, నాది ఇదే నినాదం అన్నారు. పార్టీలు వేరైనా అభివృద్ధి కోసం కలిసి పని చేస్తాం.. ఎంపీ కేశినేని నాని మైలవరం కోసం 3 కోట్ల నిధులు ఇచ్చారని గుర్తుచేసుకున్నారు. కేశినేని తాత, మా నాన్న కాలం నుండి పార్టీలు వేరైనా అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాం అన్నారు. కరుడుగట్టిన తెలుగుదేశం పార్టీ వాదిగా నాని, వైసీపీ వాదిగా నేను ఉన్నాను.. పార్టీల గురించి వ్యక్తిగత విభేదాలు పెట్టుకోకూడదు అన్నారు. మొన్నటికి మొన్న సుజనా చౌదరి ని కూడా నిధులు అడిగాను.. కొండపల్లి ఎన్నికల్లో ఇద్దరం తగ్గకుండా మా మా పార్టీల తరపున గట్టిగా పని చేశామని తెలిపారు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్.
కాగా, టీడీపీ ఎంపీ కేశినేని నాని, వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యేల ఎపిసోడ్ ఆసక్తి రేపుతున్నాయి.. వైసీపీ నేతలతో టీడీపీ ఎంపీ కేశినేని వరుస కార్యక్రమాలు పెట్టుకుంటున్నారు.. మొన్న నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ తో, నేడు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తో కార్యక్రమాల్లో పాల్గొన్నారు కేశినేని… మరోవైపు.. కేశినేని నాని మంచి వాడు అని తాజాగా వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డి వ్యాఖ్యానించారు.. అంతేకాదు.. ఆయన వైసీపీలోకి వస్తే స్వాగతిస్తామన్నారు అయోధ్య రామిరెడ్డి.. మొన్న ఎమ్మెల్యే మొండితోకతో కలిసి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడం ఓ ఎత్తు అయితే.. మొండితోక బ్రదర్స్ చాలా మంచివారంటూ నాని చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు.. ఇక, ఈ రోజు వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తో కలిసి అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఏదేమైనా.. బెజవాడ ఎంపీ కేశినేని నాని వ్యవహారం ఇప్పుడు టీడీపీతో పాటు బెజవాడ రాజకీయాల్లో హీట్ పుట్టిస్తోంది.