Bachula Arjunudu: టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు (67) కన్నుమూశారు. నెల రోజుల క్రితం గుండెపోటుకు గురైన ఆయన విజయవాడ రమేశ్ ఆస్పత్రిలో చేరారు. అయితే పరిస్థితి విషమించడంతో గురువారం సాయంత్రం ప్రాణాలు కోల్పోయారు. ఆయన మరణం పట్ల టీడీపీ నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంకు చెందిన బచ్చుల అర్జునుడు 1995 నుండి 2000 వరకు ప్రైమరీ అగ్రికల్చర్ కో ఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. అలాగే 2000 నుండి 2005 వరకు మచిలీపట్టణం మున్సిపల్ ఛైర్మన్‌గా విధులు నిర్వహించారు. 2014లో ఆయన కృష్ణా జిల్లా టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా నియమితుడయ్యారు. టీడీపీ కేంద్ర కమిటీ క్షమశిక్షణా కమిటీ ఛైర్మన్ గానూ ఉన్నారు. 2017లో శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.
Read Also: Chicken Arrest : వ్యక్తి మృతి.. కోడిని అరెస్ట్ చేసిన పోలీసులు
కాగా జనవరి నెలాఖరున బచ్చుల తీవ్ర గుండెపోటుకు గురికాగా.. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన విజయవాడలో ఉన్న రమేశ్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు స్టంట్ అమర్చి చికిత్స అందించారు.టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్వయంగా ఆస్పత్రికి వచ్చి ఆయనను పరామర్శించారు. కాగా త్వరలోనే బచ్చుల కోలుకుంటారని అందరూ భావించారు. అయితే గురువారం సాయంత్రం ఆయన పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షిస్తున్నారు.