NTV Telugu Site icon

Machani Somnath: చేనేతలపై కపట ప్రేమలను మానుకోండి..

Machani Somnath

Machani Somnath

Machani Somnath: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం వైసీపీ ఇన్‌ఛార్జ్ బుట్టా రేణుకపై తీవ్రంగా మండిపడ్డారు టీడీపీ నేత మాచాని సోమనాథ్‌. మాచాని సోమప్ప ఎక్కడైతే అభివృద్ధిని వదిలేసారో.. వాటన్నిటిని ముందుకు తీసుకెళ్తానని, చేనేత అభివృద్ధికి పాటుపడుతానని ఇటీవల చేనేత ఆత్మీయ సమ్మేళన సభలో బుట్టా రేణుక చెప్పడం చాలా విడ్డూరంగా ఉందని ఆయన విమర్శించారు. బుట్టా రేణుక నాగలదిన్నె గ్రామాన్ని తాను ఎంపీగా ఉన్నపుడు దత్తత తీసుకున్న విషయం అందరికీ తెలిసిన విషయమే. అక్కడ నాగలదిన్నెలో ఉన్న చేనేత ప్రజలకు తాను చేసింది ఏమీ లేదని మాచాని సోమనాథ్‌ తీవ్రంగా వ్యాఖ్యానించారు. అయితే ఇప్పుడు మాత్రం ఎమ్మిగనూరు నియోజకవర్గ చేనేత ప్రజలకు ఏదో చేస్తారని అనుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉందన్నారు.

Read ALso: TDP 2nd List: రేపు టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా.. చంద్రబాబు కీలక ప్రకటన

ఎమ్మిగనూరు వీవర్స్ కో-ఆపరేటివ్ సొసైటీ కింద అప్పట్లో మాచాని సోమప్ప ఒక మైదానాన్ని కేటాయించి క్రీడాస్థలంగానూ, ఎగ్జిబిషన్‌కు గానూ ఉపయోగించుకోవాలనే మంచి ఉద్దేశంతో మొదలుపెడితే దాన్ని వైసీపీ నాయకులు తమ సొంత ధనార్జన కొరకు దుకాణాలు పెట్టించి వైడబ్ల్యూసీఎస్‌కు తీరని అన్యాయాన్ని చేస్తున్నారని మండిపడ్డారు. సోమప్ప ఆశయాలకి వ్యతిరేకంగా ఇప్పుడు కార్యక్రమాలు జరుగుతున్నాయని వైసీపీ ప్రభుత్వ నాయకులకు తెలియదా అంటూ ప్రశ్నించారు. టీడీపీ ఆధ్వర్యంలో బనవాసిలో టెక్స్‌టైల్‌ పార్కు కొరకు స్థలాన్ని కేటాయిస్తే అప్పట్లో వేసిన శంకుస్థాపన, శిలాఫలకం తప్ప అక్కడ అభివృద్ధి మాత్రం శూన్యమన్నారు. చేనేతలకు ఇచ్చే పింఛన్లను చేనేతలు కానీ వైసీపీ కార్యకర్తలకు ఇచ్చారనేది నిజమా కాదా అంటూ ప్రశ్నించారు. నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కో-ఆపరేషన్ కొరకు వైడబ్ల్యూసీఎస్‌ కింద స్థలాన్ని కేటాయిస్తే ఇప్పుడు అక్కడ చేనేతలకు ఉపయోగపడే ఎటువంటి సహాయ సహకారాలు జరగడం లేదన్నారు. ఇది వైసీపీ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమని ఆయన విమర్శించారు. దీని గురించి బుట్టా రేణుక గారు ఏమి మాట్లాడకపోవడం గమనార్హమన్నారు.

2009, 2011 వరదల సమయంలో మాచాని సోమప్ప ఫౌండేషన్ కింద పేదలకు సహాయం చేశామన్నారు. Indi-village Tech Solutions pvt ltd ద్వారా ఎంతో మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం జరుగుతుందన్నారు. అలాగే విద్యార్థులకు పుస్తకాల పంపిణీ, తాగునీటి వసతులు కల్పించడం జరుగుతూనే ఉందన్నారు. ఇటువంటి సేవా కార్యక్రమాలను చేస్తున్నది మాచాని సోమప్ప ఫౌండేషన్ కింద మేమందరం చేస్తున్న సేవలు మీకు కనపడటం లేదా అని వైసీపీ నాయకులను ఉద్దేశించి మాచాని సోమనాథ్ అన్నారు. కాబట్టి ఇప్పటికైనా చేనేతపై ముసలి కన్నీళ్ళు కార్చడం ఆపాలని మాచాని సోమనాథ్ తెలియజేశారు,