Jayaho BC Meeting: ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఏపీ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. ఎన్నికలు వస్తుండటంతో అధికార, ప్రతిపక్షాలు కాలు దువ్వుకుంటున్నాయి. టీడీపీ-జనసేన కూటమి ఆధ్వర్యంలో ఇవాళ జయహో బీసీ సభ జరగనుంది. గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని ఏఎన్‌యూ ఎదురుగా ఉన్న స్థలంలో మధ్యాహ్నం 3 గంటలకు జరిగే ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ హాజరవనున్నారు. బీసీల అభివృద్ధికి సంబంధించిన అంశాలను ఈ మీటింగ్‌లో వారు ప్రకటించనున్నారు. ఇందు కోసం సాధికార కమిటీల ద్వారా బీసీల నుంచి వినతులను స్వీకరించారు.
Read Also: Srisailam: శ్రీశైలంలో 5వ రోజు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
మంగళగిరిలో జరిగే జయహో బీసీ సభలో బీసీ డిక్లరేషన్‌ను చంద్రబాబు – పవన్ కళ్యాణ్ ప్రకటించనున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టే వివిధ అంశాలను ప్రస్తావిస్తూ బీసీ డిక్లరేషన్ రూపొందించారు. బీసీ డిక్లరేషన్‌కు సంబంధించి వివిధ అంశాలను చర్చించేందుకు సోమవారం నాడు టీడీపీ కార్యాలయంలో విస్తృత స్థాయి సమావేశం జరిగింది. టీడీపీ ఆవిర్భావం నాటి నుంచి బీసీలు పార్టీకి బలమైన మద్దతుదారులుగా నిలబడ్డారని, వారి ఉన్నతి కోసం టీడీపీ ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయని టీడీపీ నేత అచ్చెన్నాయుడు వెల్లడించారు. బీసీల సమగ్రాభివృద్ధి కోసం నిర్దిష్ట విధానాలు, చర్యలతో సమగ్ర బీసీ డిక్లరేషన్‌ను చంద్రబాబు, పవన్ విడుదల చేస్తారని చెప్పారు. ఇవాళ్టి సభకు బీసీలు భారీ సంఖ్యలో రావాలని నేతలు పిలుపునిచ్చారు.