NTV Telugu Site icon

Chandrababu: మిచౌంగ్ తుఫాను వల్ల రైతులకు చాలా నష్టం కలిగింది..

Chandrababu

Chandrababu

Chandrababu: మిచౌంగ్ తుఫాను వల్ల ఏపీలో రైతులకు చాలా నష్టం సంభవించిందని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. 15 జిల్లాల్లో 25 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని.. తుఫాను హెచ్చరికలు చేసినా ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందన్నారు. హెచ్చరికలను పరిగణనలోకి తీసుకుంటే పంట నష్టం, ప్రాణ నష్టం తగ్గించొచ్చన్నారు. పంట నష్టాన్ని నివారించే పరిస్థితులున్నా.. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోలేదని చంద్రబాబు మండిపడ్డారు. పట్టిసీమ నీటిని విడుదల చేసి ఉంటే పంట ముందుగానే చేతికి వచ్చేదన్నారు. నవంబర్, డిసెంబర్ నెలల్లో వచ్చే తుఫానుల బారి నుంచి పంటలు కాపాడుకునేవాళ్లమని.. నేను పట్టిసీమ కట్టానని జగన్ నీటిని విడుదల చేయలేదన్నారు. రైతులు ప్రభుత్వాన్ని తంతారని భయంతో విధిలేని పరిస్థితుల్లో పట్టిసీమ నుంచి నీటిని విడుదల చేశారు.. కానీ అప్పటికే ఆలస్యమైందన్నారు. పంటలు తుఫాను బారిన పడ్డాయని.. ప్రాజెక్టుల మెయింటెనెన్స్‌ను పట్టించుకోవడం లేదన్నారు. అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకెళ్లిందని.. పులిచింతల, గుండ్లకమ్మ ప్రాజెక్టుల గేట్లు కొట్టుకుపోయాయని ఆయన అన్నారు. గేట్ల రిపేర్లు చేయడం లేదు.. నిర్వహణ కూడా అధ్వాన్నంగా ఉందన్నారు. రిపేర్లు చేయడానికి కాంట్రాక్టర్లు కూడా ముందుకు రాని పరిస్థితి నెలకొందన్నారు.

Read Also: MPs suspended: పార్లమెంట్ నుంచి 15 మంది ఎంపీల సస్పెండ్.. జాబితాలో మాణికం ఠాగూర్, కనిమొళిలు

పంట కాల్వల నిర్వహణ కూడా సరిగా చేయడం లేదన్నారు. సీఎం కానీ.. మంత్రులు కానీ కనీస చర్యలు తీసుకోలేదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పంట నష్టం ఎంతొచ్చిందో కూడా ప్రభుత్వం చెప్పడం లేదన్నారు. పంట నష్టంపై ఎన్యూమరేషన్ చేయడం లేదని.. ఎన్ని లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందో ప్రభుత్వం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. పంట నష్టం, ఆస్తి నష్టంపై కేంద్రానికి నివేదిక అందించాలి కదా అంటూ టీడీపీ అధినేత పేర్కొన్నారు. మిచౌంగ్ తుఫానును జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్రాన్ని కోరామని ఆయన తెలిపారు. ఇంత భారీ నష్టం జరిగితే కేవలం రూ. 700 కోట్లు పంట నష్టం జరిగిందని కేంద్రానికి నివేదిస్తారా అంటూ ఆయన మండిపడ్డారు. రూ. 700 కోట్లు పంట నష్టం అంటే కేంద్రం ఓ రూ. 100 కోట్లు మాత్రమే ఇస్తుందన్నారు. 26 లక్షల ఎకరాల్లో పంటలు వేయలేదని కేంద్రానికి ఏపీ ప్రభుత్వం నివేదించిందని.. కరవు వల్ల 26 లక్షల ఎకరాల్లో పంటలు వేయకుంటే కేంద్రానికి కరవు నివేదిక అనేది ఇవ్వలేదన్నారు. నష్టపోయిన పంటలకు ఎంత ధర చెల్లిస్తారో ప్రభుత్వం చెప్పాలి కదా అంటూ చంద్రబాబు ప్రశ్నించారు.

Read Also: Pawan Kalyan and Barrelakka: బర్రెలక్కకు పడినన్ని ఓట్లు కూడా రాలేదు.. పవన్‌పై సీఎం జగన్‌ సెటైర్లు

టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ.. “పంటల బీమా వ్యవస్థను సర్వనాశనం చేశారు. జగన్ ప్రభుత్వం పంటల భీమా చెల్లింపులు జరపలేదు. రైతుల కోసం సెపరెట్ బీమా కంపెనీ పెడతానని రైతులను మోసం చేశారు. ప్రధాన ప్రతిపక్షంగా మేం ప్రశ్నిస్తే కనీసం సమాధానం చెప్పరా.? మాకు సమాధానం చెప్పకున్నా ఫర్వాలేదు.. రైతులకైనా చెప్పరా..?. రైతులు కోలుకోలేని పరిస్థితికి వచ్చారు. వరి పంట నష్టం నిమిత్తం హెక్టారుకు రూ. 30 వేలు ఇవ్వాలి. రైతులు ఆత్మహత్య చేసుకుంటే రూ. 10 లక్షలివ్వాలి. మాకు సమాధానం చెప్పకున్నా ఫర్వాలేదు. రైతులను ఏ విధంగా ఆదుకోవాలోననే విధానం ప్రభుత్వం వద్ద ఉందా..? 22 మంది వైసీపీ ఎంపీలు ఢిల్లీలో ఏం చేస్తున్నారో.. ఏం పైరవీలు చేస్తున్నారో..? మిచౌంగ్ తుపానును జాతీయ విపత్తుగా ప్రకటించాలని మేమే కోరాం. బాధల్లో ఉన్న రైతులను సీఎం జగన్ కార్పెట్ వేసుకుని పరామర్శిస్తారా..? ఆలుగడ్డకు.. ఉల్లిగడ్డకు తేడా తెలియని మనిషి ఈ సీఎం. అంగన్వాడీ కార్యకర్తలు తమ డిమాండ్ల కోసం పోరాడుతుంటే అణచివేస్తారా..? అంగన్వాడీ కార్యకర్తలకు ఓ రోజు వస్తుంది.. వాళ్లంటే ఏంటో చూపిస్తారు. ప్రస్తుతం రాష్ట్రం పడుతున్న ఇబ్బందులకు కారణం ఒక్క ఛాన్స్ పాపమే. ఏపీలో మార్పు మొదలైంది.జగన్ ప్రభుత్వాన్ని శాపనార్ధాలు పెడుతున్నారు. విద్యార్థుల్లో విపరీతమైన అసహనం.. అశాంతి. యువతలో పెద్ద ఎత్తున వ్యతిరేకత గతంలో ఎప్పుడూ చూడలేదు. నిరుద్యోగంలో ఏపీ నెంబర్-1. ” అని ఆయన పేర్కొన్నారు.

 

Show comments