ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిపై వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌ని విమర్శించే స్థాయి ఆదినారాయణ రెడ్డికి లేదన్నారు. అధికారం లేకపోతే పిల్లిలా ఉండే ఆదినారాయణ రెడ్డి.. ఇప్పుడు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. అవసరాన్ని బట్టి పార్టీలు మార్చే వ్యక్తి అని విమర్శించారు. చికెన్ షాపుల్లో కూడా కమీషన్లు కొట్టేసే స్థాయి ఆదినారాయణ రెడ్డిది అని ఎద్దేవా చేశారు. జగన్ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడటానికి ఆయనకి నోరెలా వచ్చిందని ఎమ్మెల్యే తాటిపర్తి మండిపడ్డారు.
‘వైఎస్ జగన్‌ని దూషిస్తే సీఎం చంద్రబాబు తనకు మంత్రి పదవి ఇస్తాడని ఆదినారాయణ రెడ్డి అనుకుంటున్నారు. మంత్రి పదవి కావాలంటే మరోమార్గం చూసుకో ఆదినారాయణ రెడ్డి. అంతేగానీ జగన్ గురించి మాట్లాడితే సహించేది లేదు. టీడీపీ నేతలు నకిలీ లిక్కర్ వ్యాపారం చేస్తుంటే మా పార్టీ నేత జోగి రమేష్ ని అరెస్టు చేశారు. ఎలాంటి ఆధారాలు లేకపోయినా జనార్థన్ రావు చెప్పాడని జోగి రమేష్ ని అరెస్టు చేస్తారా?. ఇంతటి కక్ష రాజకీయాలు దేశంలో మరెక్కడా జరగటం లేదు. టీడీపీ ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాసరావే వారి పార్టీ నేతలు చేస్తున్న నకిలీ మద్యం అక్రమాలను బయట పెట్టారు’ అని ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు.
Also Read: Ravi Teja: హిట్ డైరెక్టర్, సైన్స్ ఫిక్షన్ స్టోరీ.. ‘రవితేజ’ పెద్ద ప్లానింగే!
‘స్పీకర్ అయ్యన్న పాత్రుడు నోరు అదుపులో పెట్టుకోవాలి. స్పీకర్ పదవిని కించపరిచేలా మాట్లాడవద్దు. ఎమ్మెల్యేలను గాడిదలు అన్నారంటే ఆయనకు ఎంత అధికార గర్వమో అర్థం చేసుకోవచ్చు. సీఎం చంద్రబాబు కూడా ఎమ్మెల్యేనే కదా?, ఆయన కూడా గాడిదేనా?. స్పీకర్ తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలి. అయ్యన్న లాంటి కుసంస్కారి ఇంకెవరూ లేరు. ఎమ్మెల్యేలు మూడు లక్షల జీతం తీసుకుంటున్నట్లు మాట్లాడుతున్నారు. అసలు ఎమ్మెల్యేలకు జీతం ఎంతో కూడా స్పీకర్ కు తెలియదు. రైతులు కష్టాల్లో ఉంటే చంద్రబాబు విదేశాల్లో పర్యటిస్తారా?. తండ్రి విదేశాల్లో విహరిస్తుంటే కొడుకు క్రికెట్ చూడటానికి ముంబై వెళ్లాడు. సకల శాఖా మంత్రి లోకేష్ వలన రాష్ట్రానికి ఏం ప్రయోజనం చేకూరింది?. స్కూల్ పిల్లలతో టీచర్ కాళ్లు ఒత్తించుకోవటం, కొంతమంది స్కూల్ పిల్లలపై అఘాయిత్యాలు జరుగుతుంటే లోకేష్ క్రికెట్ చూస్తూ సరదాగా గడుపుతున్నారు. పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వెళ్లి కూర్చున్నారు. తోటి ఎమ్మెల్యేలపై ఇష్టానుసారం మాట్లాడే స్పీకర్ అయ్యన్న ఒక్కడే. చంద్రబాబు చాలాకాలం అసెంబ్లీకి రాకుండా జీతం తీసుకున్నారు. అధికార గర్వంతో మాట్లాడటం స్పీకర్ కే చెల్లింది. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇస్తే కచ్చితంగా అసెంబ్లీకి వస్తాం. మేము నిత్యం ప్రజల మధ్యనే ఉంటున్నాం. ప్రజా పోరాటాలు చేస్తున్నాం. మా జీతభత్యాలు కట్ చేయాలనుకుంటే చేసుకోండి. మేము ఎవరమూ అడ్డుకోము. కానీ ఎమ్మెల్యేలను తక్కువ చేసి మాట్లాడితే సహించం’ అని ఎమ్మెల్యే తాటిపర్తి వార్నింగ్ ఇచ్చారు.