రాయలసీమలో సుప్రసిద్ధ జాతరగా పేరొందిన తిరుపతి తాతయ్యగుంట ‘గంగమ్మ జాతర’కు అరుదైన గౌరవం దక్కింది. పాఠ్య పుస్తకాలలో జాతరను పాఠ్యాంశంగా తమిళనాడు ప్రభుత్వం పెడుతోంది. పదో తరగతి తెలుగు రీడర్‌లో గంగ జాతర పాఠ్యాంశం ఉంటుంది. ఎస్వీ యూనివర్సిటీ ప్రొఫెసర్ పేట శ్రీనివాసులు రెడ్డి రాసిన గంగ జాతరను తమిళనాడు సర్కార్ పాఠ్యాంశంగా ముద్రించింది. జానపద సాహిత్యాన్ని ఆదరించిన తమిళనాడు ప్రభుత్వానికి రచయిత పేటశ్రీ ధన్యవాదాలు తెలిపారు.
Also Read: Payyavula Keshav: కుట్రలు, కుతంత్రాలు దేశాన్ని ఏమీ చేయలేవు!
తిరుపతి గంగమ్మ జాతరను రాష్ట్ర పండుగగా గుర్తిస్తూ 2023లో ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. గంగమ్మ తల్లి జాతరకు దాదాపు తొమ్మిది శతాబ్దాల గొప్ప చరిత్ర ఉంది. గంగమ్మను శ్రీ వేంకటేశ్వర స్వామి చెల్లెలుగా భావిస్తారు. శ్రీవారికి స్వయాన చెల్లెలుగా టీటీడీ నుంచి గంగమ్మ సారె అందుకుంటోంది. సనాతన సంప్రదాయాలు, సంస్కృతిని అనుసరిస్తూ జాతరలో రోజుకో వేషం ధరిస్తూ ఏడు రోజుల పాటు భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. దుష్టుల నుంచి స్త్రీలను కాపాడటానికి స్వయానా అమ్మవారు వివిధ వేషాలతో సాక్షాత్కరించిందన్న విశ్వాసంతో భక్తులు మొక్కులు చెల్లించుకొంటున్నారు. మాతంగి వేషంలో మగవారు మహిళల దుస్తులతో నృత్యం చేస్తూ.. అమ్మవారిని దర్శించుకోవడం జాతరలో ప్రత్యేక ఆకర్షణ. ప్రతి ఏడాది చైత్రమాసం చివరి వారంలో ఏడు రోజుల పాటు జాతర జరుగుతుంది.