ప్రస్తుతం తెరకెక్కుతున్న సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయిన నెలరోజులకు ఓటీటీలకు వచ్చేస్తున్నాయి. మరి కొన్నిరోజులకు టీవీలోకి వచ్చేస్తున్నాయి. అలాగే మరికొన్ని సినిమాలు థియేటర్ లో కాకుండా నేరుగా ఓటీటీ లో విడుదల అవుతుందటం చూస్తూనే వున్నాము. తాజాగా ఓ సినిమా థియేటర్లు, ఓటీటీలను కాదని నేరుగా టీవీలోకి మూవీ రావడం అందరికి ఆశ్చర్యం కలిగించింది.. తమిళ సినిమా పొన్ ఒండ్రు కండెన్ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ అంటూ ఇటీవల కలర్స్ తమిళ్ ఛానెల్ అనౌన్స్ చేయడం ఆ మూవీ నటీనటులను కూడా ఆశ్చర్యానికి గురి చేసింది.కనీసం తమకు కూడా చెప్పకుండా జియో సినిమాలాంటి మేకర్స్ మూవీని నేరుగా టీవీలో రిలీజ్ చేయడం ఏంటని ఇందులో నటించిన వసంత్ రవి ట్వీట్ చేశాడు. గురువారం (మార్చి 14) ఈ మూవీ ప్రీమియర్ విషయాన్ని సదరు ఛానెల్ ఓ వీడియో ద్వారా ట్వీట్ చేసింది. ఇది చూసి షాక్ తిన్న వసంత్ రవి కూడా ఇదేంటని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశాడు.
వసంత్ రవి ఆ ట్వీట్ లో ఏమన్నాడంటే.. “షాకింగ్.. అసలు ఇది నిజమేనా? జియో స్టూడియోస్ లాంటి పేరున్న, టాప్ ప్రొడక్షన్ హౌజ్ నుంచి ఇలాంటిది ఊహించలేదు. పొన్ ఒండ్రు కండెన్ మూవీ ప్రోమో, వరల్డ్ శాటిలైట్ ప్రీమియర్ తేదీని కనీసం అశోక్ సెల్వన్, ఐశ్వర్యలక్ష్మి, డైరెక్టర్ ప్రియ మేడమ్, సినిమాతో సంబంధం ఉన్న ఎవరికీ చెప్పకుండా అనౌన్స్ చేయడం చూస్తుంటే చాలా బాధగా ఉంది. ఈ సినిమా కోసం మేము చాలా కష్టపడ్డాం. పొన్ ఒండ్రు కండెన్ టీమ్ మొత్తానికి ఈ విషయం గురించి తెలియదు. ఎవరూ చెప్పలేదు. సోషల్ మీడియా ఎక్స్ ద్వారానే ఈ విషయం చెప్పినందుకు జియో స్టూడియోస్ కు కృతజ్ఙతలు. సినిమాను క్రియేట్ చేసినవాళ్లకు లేదంటే నటీనటులకు మీ కమర్షియల్ నిర్ణయంపై ఎలాంటి అధికారం ఉండదని తెలుసు. కానీ దీనికి సంబంధించిన సమాచారాన్ని మీ నుంచి నేరుగా వినే హక్కు వాళ్లకు ఉంది” అని వసంత్ రవి చాలా ఘాటుగా రియాక్ట్ అయ్యాడు.ఈ పొన్ ఒండ్రు కండెన్ మూవీలో వసంత్ రవితోపాటు ఐశ్వర్య లక్ష్మి నటించింది. మూవీని ప్రియా కామాక్షి డైరెక్ట్ చేయగా.. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందించాడు.