Site icon NTV Telugu

Etela Rajender : ఈటలకు కేసీఆర్‌ ఫోన్‌.. క్లారిటీ ఇచ్చిన ఈటల రాజేందర్‌

Etela

Etela

Etela Rajender : బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తన గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న వివాదాస్పద ప్రచారంపై స్పష్టత ఇచ్చారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనను ఫోన్ చేసి మళ్లీ కలిసి పని చేయాలని పిలిచారన్న వార్తలు పూర్తిగా నిరాధారమైనవని తేల్చిచెప్పారు. ‘‘నేనంటే గిట్టని వారు, సోషల్ మీడియాలో ఉండే సైకోలు, శాడిస్టులు మాత్రమే ఇలాంటి ప్రచారం చేస్తున్నారు. ఇందులో ఎలాంటి నిజం లేదు’’ అని ఖండించారు. తాను చాలా కాలంగా బీఆర్ఎస్, కేసీఆర్ విషయంలో తన స్పష్టమైన అభిప్రాయాన్ని చెబుతూనే ఉన్నప్పటికీ, కొంతమంది కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ‘‘ఇది పూర్తిగా బాధ్యత లేని వ్యక్తుల శాడిజం. నాపై ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసేవారిపై త్వరలోనే చట్టపరమైన చర్యలు తీసుకుంటా’’ అని హెచ్చరించారు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈటల ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ‘‘మళ్లీ కేసీఆర్ పిలిస్తే వెళ్తారా?’’ అనే ప్రశ్నకు ఆయన ఘాటుగా స్పందించారు. ‘‘ఇదేమైనా పిల్లల ఆటనా? మేమంతా బాధ్యత ఉన్న పొలిటికల్ లీడర్లు. వాళ్ల పార్టీ వాళ్లది, మా పార్టీ మాది. రేపు నేను బీఆర్ఎస్‌ను ఓడించి తెలంగాణలో బీజేపీని గెలిపించడం నా లక్ష్యం’’ అని స్పష్టం చేశారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రోజులో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో సరైన సమాచారం లేదని ఈటల రాజేందర్ విమర్శించారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన కూడా శాస్త్రీయత లేనిదేనని ఆరోపించారు.

Aadhar card: భారతదేశంలో ఆ రాష్ట్రంలో ఆధార్ కార్డులు నిషేధం!.. కారణం ఏంటంటే?

వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే బీసీ-ఈ గ్రూప్ తీసుకొచ్చారన్నది తప్పుడు వాదన అని, నిజానికి ఆతకుముందే కొన్ని ముస్లిం కులాలు బీసీ-బీ గ్రూప్‌లో ఉన్నాయని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి నిష్పక్షపాత దృష్టి, చిత్తశుద్ధి, సరైన ప్రణాళిక ఏమీ లేదని తీవ్రంగా విమర్శించారు. ఒక కమిషన్ ఏర్పాటు చేసి, దానికి చట్టబద్ధత కల్పించి, రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న కులాలను గుర్తించాకే జనగణన చేయాలని సూచించారు. ‘‘ఇలాంటివేవీ చేయకుండా కులగణన పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది. అవగాహన లేని వారు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారని, ఇది ప్రజలకు మేలు చేసే కార్యక్రమం కాదని’’ ఈటల వ్యాఖ్యానించారు.

తాను విద్యార్థిగా ఉన్నప్పుడు విద్యార్థి సంఘాల్లో చురుకుగా పనిచేశానని, సోషల్ వెల్ఫేర్ హాస్టల్‌లో చదువుకున్నానని, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నానని వెల్లడించారు. విద్యార్థి సంఘాలతో కలిసి పని చేసి అనేక సమస్యలపై పోరాటం చేశానని, విద్యార్థుల హక్కుల కోసం ఎప్పుడూ నిలబడతానని చెప్పారు.

ఈటల రాజేందర్ తన రాజకీయ ప్రస్థానంలో కట్టుబడి ఉన్న తన నిబద్ధతను మరోసారి తెలియజేస్తూ, తనపై వస్తున్న ఆరోపణలను ఖండించారు. బీజేపీ తరపున తెలంగాణలో బీఆర్ఎస్‌కు గట్టి పోటీ ఇచ్చి, అధికారంలోకి రావడమే తన అసలైన లక్ష్యమని స్పష్టం చేశారు.

Maha Kumbh mela 2025: కుంభమేళాలో ప్రధాని మోడీ పుణ్య స్నానం

Exit mobile version