Salman Ali Agha: నేటి నుంచి టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. వచ్చే నెల 8 వరకు ఈ సీజన్ కొనసాగనుంది. అయితే.. ఈ టీ20 వరల్డ్ కప్ పాకిస్థాన్ జట్టుకు పెద్ద సవాలుగా మారింది. భారత్‌తో మ్యాచ్ బహిష్కరణ చుట్టూ పెద్ద చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఆ జట్టు కెప్టెన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ విషయాలన్నింటినీ పక్కన పెట్టి మైదానంలో గెలుపుపైనే దృష్టి పెట్టాలని కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా స్పష్టం చేశాడు. “బయట ఏం జరుగుతుందో మేం ఎక్కువగా పట్టించుకోం. జట్టుగా మేం వాటి గురించి మాట్లాడం. అలా చేస్తేనే మన ఆటపై ఫోకస్ పెట్టగలం” అని అన్నాడు. భారత్‌తో ఫిబ్రవరి 15న జరగాల్సిన మ్యాచ్‌ను పాకిస్థాన్ బహిష్కరించాలనే నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్‌కు మద్దతుగా ఈ నిర్ణయం తీసుకున్నామని చెబుతున్నారు. బంగ్లాదేశ్ భద్రతా కారణాలతో భారత్‌కు రావడం నిరాకరించడంతో వారి స్థానంలో స్కాట్లాండ్‌ను చేర్చారు. ఈ నిర్ణయం వల్ల పాకిస్థాన్‌కు రెండు పాయింట్లు నష్టమవుతాయి. దాంతో గ్రూప్ దశలో మిగిలిన మూడు మ్యాచ్‌లు తప్పకుండా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ అంశంపై స్పందించిన సల్మాన్ “ఇలాంటి వివాదాలు ఆటకు మంచివి కావు. మాకు వ్యక్తిగతంగా బాధగా అనిపించకపోయినా.. క్రికెట్ కోణంలో ఇలా జరగడం మంచిది కాదు. మేము రోల్ మోడల్స్‌లాంటివాళ్లం. మేము ఏం చేస్తామో పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. అందుకే ఇలాంటి విషయాలు దూరంగా ఉండాలి.” అని చెప్పాడు.
READ MORE: Team India: టీ20 వరల్డ్‌కప్ ముందు భారత జట్టులో భారీ మార్పులు.. డీఎప్సీ ఎంట్రీకి లైన్ క్లియర్
గ్రూప్‌లో భారత్‌తో పాటు నెదర్లాండ్స్, అమెరికా, నమీబియా జట్లు ఉన్నాయి. భారత్ మ్యాచ్ లేకపోవడంతో ఈ మూడు జట్లతో జరిగే పోరాటాలే పాకిస్థాన్ భవితవ్యాన్ని నిర్ణయిస్తాయి. అయితే దీనిపై ఎలాంటి ఒత్తిడి లేదని సల్మాన్ చెప్పాడు. “ఐసీసీ టోర్నమెంట్‌కు వచ్చామంటే దాదాపు అన్ని మ్యాచ్‌లు గెలవాల్సిందే. మేము కూడా అదే ఉద్దేశంతో వచ్చాం. ప్రతి మ్యాచ్‌లో మా బెస్ట్ ఇస్తాం” అన్నాడు. కొలంబోలో జరగబోయే మ్యాచ్‌లకు వాతావరణం ఓ సమస్యగా మారవచ్చు. ఐర్లాండ్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్ భారీ వర్షంతో రద్దయ్యింది. దీనిపై సల్మాన్ చాలా ప్రశాంతంగా స్పందించాడు. “వాతావరణం మన చేతుల్లో లేదు. మన కంట్రోల్‌లో లేని విషయాల గురించి ఆలోచించడం వృథా. మాకు ఉన్న మూడు మ్యాచ్‌లు ఎలా గెలవాలి అన్నదానిపైనే దృష్టి పెడతాం” అని అన్నాడు. ఇటీవలి కాలంలో భారత్–పాకిస్థాన్ మ్యాచ్‌లలో క్రికెట్ కంటే బయటి విషయాల గురించే ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయని సల్మాన్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. “మేం క్రీడాకారులం. క్రికెట్ ఆడటానికి, క్రికెట్ గురించే మాట్లాడటానికి వచ్చాం. ఈ విషయాలు అంతవరకే ఉండాలి. మేము వీటిని మన ఆటపై ప్రభావం చూపనివ్వం” అని చెప్పాడు.
