మహిళల టీ20 ప్రపంచకప్ 2024లో భారత్ పేలవ ప్రదర్శన చేసింది. లీగ్ దశలో ఆడిన నాలుగు మ్యాచ్‌లలో రెండు మాత్రమే గెలిచి.. ఇంటిదారి పట్టింది. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ హాఫ్ సెంచరీ చేసినా.. ఆమె నిదానంగా ఆడటం వల్లే ఓటమి ఎదురైందని సోషల్ మీడియాలో ట్రోల్స్ వచ్చాయి. భారత్ లీగ్ దశ నుంచే నిష్క్రమించడంతో.. ఇప్పుడు ఆమె కెప్టెన్సీకే ప్రమాదం పొంచి ఉందనే వార్తలు వస్తున్నాయి. ఈ రూమర్లపై బీసీసీఐ వర్గాలు స్పందించాయి.
‘టీ20 ప్రపంచకప్ 2024లో భారత్ ప్రదర్శన అస్సలు బాలేదు. హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీపై మాజీల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. కొత్త కెప్టెన్‌ను నియమించాలా? లేదా హర్మన్‌ను కొనసాగించాలా? అనేది ఇప్పుడే చెప్పలేం. జట్టుకు కొత్త నాయకత్వం అవసరమైతే.. అందుకు తగ్గట్టు నిర్ణయం తీసుకొనేందుకు బీసీసీఐ వెనకడుగు వేయదు. జట్టుకు కావాల్సింది అందించేందుకు బోర్డు సిద్ధంగా ఉంటుంది. హర్మన్ ఇప్పటికీ జట్టులో కీలక సభ్యురాలు. జట్టులో మార్పులు చేయాల్సిన సమయం ఆసన్నమైందని బీసీసీఐ భావిస్తోంది. కోచ్, సెలక్షన్ కమిటీతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటాం’ అని బీసీసీఐ వర్గాలు ఓ జాతీయ మీడియాకు తెలిపాయి.
Also Read: C 202 Movie: వెన్నులో వణుకు పుట్టించే ‘సి 202’ రిలీజ్ ఎప్పుడంటే?
త్వరలోనే ప్రధాన కోచ్ అమోల్ ముజుందార్, సెలక్షన్ కమిటీతో బీసీసీఐ మేనేజ్‌మెంట్ సమావేశం కానుందట. హర్మన్‌ను సారథిగా కొనసాగించాలా? వద్దా? అనేది అప్పుడే తేలనుంది. ఒకవేళ ఆమెను తప్పిస్తే.. కెప్టెన్సీ రేసులో ఇద్దరు ముందువరుసలో ఉన్నారు. వైస్ కెప్టెన్ స్మృతీ మంధానతో పాటు బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ రేసులో ఉన్నారు. మంధాన కంటే రోడ్రిగ్స్‌కు పగ్గాలు అప్పగించడం మంచిదని మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ అంటున్నారు.