తెలంగాణలో రాజకీయాలు రోజుకో మలుపు తీసుకుంటున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీల మధ్య చేరికలు జోరందుకున్నాయి. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రధాన పార్టీల నాయకులు కండువాలు మారుస్తున్నారు. అయితే తాజాగా బీజేపీ నాయకులు స్వామి గౌడ్ గులాబీ గూటికి చేరబోతున్నారు. బీజేపీ పార్టీకి రాజీనామా చేసి.. ఆ రాజీనామా లేఖను తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌కు పంపించారు. బండి సంజయ్‌కు పంపిన రాజీనామా లేఖలో.. ‘అనేక ఆకాంక్షలతో బీజేపీలో చేరినప్పటికీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గుర్తించడంలోనూ, గౌరవించడంలో మీరు అనుసరిస్తున్న తీరు నా మనస్సును చాలా గాయపరిచింది. పార్టీలో ఉన్న ధనవంతులకు, బడా కాంట్రాక్టర్లకు ప్రాతనిథ్యం పెంచుతూ, నిబద్ధతతో, నిజాయితీగా ప్రజా సమస్యల పట్ల నిరంతరం శ్రమిస్తున్న బలహీన వర్గాల కార్యకర్తల పట్ల, నాయకుల పట్ల మీరు అనుసరిస్తున్న తీరు ఆక్షేపనీయం.
Also Read : Swamy Goud: బీజేపీకి స్వామి గౌడ్ బై..బై.. సీఎం కేసీఆర్‌తో భేటీ
బడుగు బలహీన వర్గాల ప్రతినిధిగా ఎదిగిన మీరు బలహీన వర్గాల ఉన్నతికి ఎలాంటి ప్రయత్నం చేయకుండా, ఇతరులు చెప్పినట్లు నడుచుకొని నాలాంటి ఎందరో నాయకులు అనేక అవమానాలకు గురవుతున్నారు. పార్టీలో అవమానాలు బరిస్తూ కొనసాగలేకపోతున్నాను. కలత చెందిన మనస్సుతో నా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. పార్టీలో ఇంతకాలం మీరందించిన సహకారానికి ధన్యావాదాలు’ అంటూ స్వామి గౌడ్ రాజీనామా లేఖను బండి సంజయ్‌కు పంపించారు. ఇదిలా ఉంటే.. మరికొద్దిసేపట్లో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో స్వామిగౌడ్ చేరనున్నారు.