MLC Sheikh Sabji: పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం చెరుకువాడ వద్ద జరిగిన ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ రోడ్డు ప్రమాదంపై కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. షేక్ సాబ్జీ మరణం ప్రమాదం కాదు, హత్య అంటూ ఆయన కొడుకు, సోదరుడు ఆరోపిస్తున్నారు. రాబోయే ఎన్నికల ముందు ఉపాధ్యాయులకు మద్దతుగా ఉండే ఎమ్మెల్సీని కావాలనే అంతమొందించారని వారు ఆరోపణలు చేస్తున్నారు. గతంలో కూడా ఆయనపై కుట్ర పన్నారని.. 140 కి.మీ.ల వేగంతో వచ్చి కారును ఢీకొన్నట్లు పోలీసులే చెప్తున్నారని వారు అంటున్నారు. ఘటనపై సీబీ సీఐడీ ఎంక్వయిరీ వేసి, న్యాయం చేయాలన్నారు. పోలీసులకు కూడా ఫిర్యాదు చేస్తున్నట్లు ఎమ్మెల్సీ సోదరుడు ఫరీద్ కాశిం తెలిపారు.
Read Also: Perni Nani: చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లపై పేర్ని నాని ఫైర్
శుక్రవారం రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మృతి చెందారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం చెరుకువాడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన దుర్మరణం చెందారు. ఎదురెదురుగా వచ్చిన రెండు కార్లు ఢీకొన్న ఘటనలో సాబ్జీకి తీవ్ర గాయాలు కాగా.. ఆస్పత్రికి తరలిస్తుండగా ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఏలూరు నుంచి భీమవరం వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వస్తున్న కారు ఢీ కొట్టింది. ఎదురుగా వస్తున్న కారు అదుపుతప్పి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్సీ మృతి చెందగా.. సీసీకి గాయాలయ్యాయి. గన్‌మెన్‌కి కూడా గాయాలు కాగా.. భీమవరం ఆసుపత్రికి తరలించారు. ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మృతదేహాన్ని భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించనున్నట్లు తెసులుస్తోంది. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్, ఎస్పీ ఆసుపత్రికి చేరుకున్నారు.