Bombay High Court: తన భార్య వ్యభిచారానికి పాల్పడుతుందనే అనుమానంతో ఆమె కుమారుడికి డీఎన్ఏ పరీక్ష చేయించడం సరైంది కాదని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. మైనర్ బాలుడి తండ్రిని నిర్ధారించేందుకు డీఎన్ఏ పరీక్ష చేయాలన్న ఫ్యామిలీ హైకోర్టు ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. కేసును విచారించిన న్యాయమూర్తి ఆర్ఎం జోషి, జూలై 1న ఇచ్చిన తన తీర్పులో.. ‘‘డీఎన్ఏ పరీక్షను చాలా అసాధారణమైన సందర్భాల్లో మాత్రమే ఆదేశించగలం. కేవలం ఒక వ్యక్తి భార్య వ్యభిచారంలో ఉందని ఆరోపించిన మాత్రాన అలా చేయలేం’’ అని పేర్కొన్నారు.
Read Also: Nimisha Priya: ఉరికంబం ఎక్కబోతున్న నిమిషా ప్రియను కాపాడే అవకాశం ఉందా.?
సదరు వ్యక్తి తన భార్య వ్యభిచారం ఆరోపణలపై విడాకులు కోరాడు. అయితే, తనకు బిడ్డ పుట్టలేదని ఎప్పుడూ స్పష్టం చెప్పలేదని హైకోర్టు గుర్తించింది. 2011లో వివాహం చేసుకున్న ఈ దంపతులు, 2013 నుంచి వేరుగా నివసించడం ప్రారంభించారు. ఆ సమయానికే ఆ మహిళ మూడు నెలల గర్భవతి. ఈ కేసులో 2020లో ఫ్యామిలీ కోర్టు, బిడ్డకు డీఎన్ఏ పరీక్ష చేయాలని ఆదేశించింది. ఈ ఉత్తర్వులు హైకోర్టులో సవాల్ చేయబడ్డాయి.
ఈ కేసును విచారించిన హైకోర్టు, వ్యభిచార ఆరోపణలు నిరూపించడానికి ఇతర ఆధారాలను ఉపయోగించవచ్చు తప్పా, బాలుడికి డీఎన్ఏ పరీక్షలు చేయాల్సిన అవసరం లేదని పేర్కొంది. మైనర్ పిల్లవాడు తల్లిదండ్రుల మధ్య గొడవల్లో ఒక సాధనంగా మారుతున్నాడని, ఇలాంటి సందర్భాల్లో కోర్టులు బాలుడి హక్కులకు పరిరక్షణగా వ్యవహరించాలని పేర్కొంది. బాలుడి వయసు అనుమతి ఇవ్వలేని వయసు కాబట్టి బలవంతంగా రక్త పరీక్ష చేయడం న్యాయసమ్మతం కాదని సుప్రీంకోర్టు తీర్పును బాంబే హైకోర్టు ఉదహరించింది.