TTD: తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహణకు పాలకమండలిని నియమిస్తుంది ప్రభుత్వం. గతంలో 18 మందితో కూడిన పాలకమండలి నియామకం జరగగా.. ప్రస్తుత పాలకమండలి సభ్యుల సంఖ్య 35కి చేరుకుంది. వీరికి తోడు పలు రాష్ర్టాలకు సంబంధించిన టీటీడీ లోకల్ బాడీ చైర్మన్లు కూడా పాలకమండలి సభ్యుల తరహాలో వ్యవహరిస్తున్నారు. మరోవైపు గతంలో తెలుగు రాష్ర్టాలతో పాటు తమిళనాడు, కర్నాటక నుంచి ఒక్కొక్కరికి పాలకమండలిలో చోటు దక్కుతుండగా.. ఇప్పుడు తెలుగు రాష్ర్టాల వారికంటే.. ఇతర రాష్ర్టాల సభ్యులే ఎక్కువగా వుంటున్నారు. ఇలా కాలక్రమేణా మారుతూ వస్తున్న ప్రస్తుత టీటీడీ పాలకమండలి గడువు ఆగస్టు 12తో ముగియనుంది.
టీటీడీ చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డిని రెండోసారి 2021 ఆగస్ట్ 12న నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చెయ్యగా.. సభ్యులను సెప్టెంబర్ చివర్లో నియమించింది. అయినప్పటికీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచే పాలకమండలి గడువు అమలులోకి వస్తుంది. అలా ప్రస్తుత పాలకమండలి గడువు ఆగస్టు 12వ తేదీతో ముగియనుండటం.. ఇప్పటికే రాజకీయంగా బిజీ షెడ్యూల్ తో వుంటున్న చైర్మన్ వైవి సుబ్బారెడ్డి మరోసారి కొనసాగనని స్పష్టత ఇచ్చారు. దీంతో ప్రభుత్వం ముందు రెండు ఆప్షన్లు వున్నాయి. ఒకటి నూతనంగా పాలకమండలిని ఏర్పాటు చెయ్యడం.. లేదా ఎన్నికల సంవత్సరం కాబట్టి.. తాత్కాలికంగా స్పెసిఫైడ్ అథారిటీని నియమించడం.. ఈ రెండు ఆప్షన్లను పరిశీలిస్తోంది ప్రభుత్వం.
టీటీడీ పాలకమండలిలో చోటు కోసం ప్రయత్నించని వారంటు లేరు. ఒక్కప్పుడు రాష్ర్టం వరకే పరిమితమైన టీటీడీ పాలకమండలిలో సభ్యత్వం కోసం సిఫార్సుల తంతు.. ఇప్పుడు దేశమంతా పాకింది. పాలకమండలిలో సభ్యత్వం కోసం కేంద్రంలో కీలకమైన నాయకులే కాకూండా కేంద్ర మంత్రులు, గవర్నర్లు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు సిఫార్సు చేసే పరిస్థితి ఏర్పడింది. దీంతో పాలకమండలి నియమాకం రాష్ర్ట ప్రభుత్వానికి పెద్ద తలనొప్పి. ఇది ఏ స్థాయికి చేరుకుందంటే…రాజకీయ ఒత్తిళ్ళకు తట్టుకోలేక గత పాలకమండలి నియమాక సమయంలో ఎన్నడూ లేని విధంగా 85 మందితో జంబో జెట్ పాలకమండలని నియమించింది రాష్ర్ట ప్రభుత్వం. ఆర్డినెన్స్ తీసుకువచ్చి35 మంది సభ్యులుతో పాటు మరో 50 మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించింది ప్రభుత్వం. కాని జెంబో జెట్ పాలకమండలి నియమాకంపై బీజేపీ నాయకులు కోర్టుకి ఎక్కడంతో.. ప్రత్యేక ఆహ్వనితుల నియమాకంను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారి చేసింది హైకోర్టు. అప్పటి నుంచి ఈ అంశం కోర్టు పరిధిలోనే వుంది. దీంతో ప్రస్తుత పాలకమండలి గడువు ముగిసిన తరువాత నూతన పాలకమండలి నియామక సమయంలో 35 మంది సభ్యులకే రాష్ర్ట ప్రభుత్వం పరిమితం కావలసి వుంటుంది.
ఎన్నికల సీజన్ కావడంతో టీటీడీ పాలకమండలిలో సభ్యత్వం ఆశించే వారి సంఖ్య ఎక్కువగానే వుంటుంది. మరోవైపు గతంలో లాగా ఇతర రాష్ర్టాల వారికి పాలకమండలి పెద్ద పీట వేస్తే.. స్వపక్షంలో అసంతృప్తి జ్వాలలు మరింత పెరిగే అవకాశం వుంది. ఈసారి ప్రభుత్వం అలాంటి ప్రయత్నం చెయ్యకపోవచ్చు. మరి ఎన్నికల ఏడాదిలో ఇంతటి ఒత్తిళ్లకు ప్రభుత్వం తట్టుకుటుందా.. లేక ఇవన్నీ ఎందుకులే అని స్పెసిఫైడ్ అథారిటిని నియమించి చేతులు దులుపేసుకుంటుందా అన్నది చూడాలి.