వైసీపీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి కుటుంబ సభ్యులు భూఆక్రమణపై నేటి నుంచి సర్వే నిర్వాహణ కోసం ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. చింతకొమ్మదిన్నె మండలంలో సజ్జల కుటుంబ సభ్యులైన సజ్జల సందీప్ రెడ్డి 71.49 ఎకరాలు, సజ్జల జనార్దన్ రెడ్డి 16.85 ఎకరాలు, వై సత్య సందీప్ రెడ్డి 21.4 ఎకరాలతో సహా సజ్జన విజయ్ కుమారి తదితరులకు మొత్తం 146.75 ఎకరాల భూమి ఉన్నట్లు గత సర్వేలో అధికారులు గుర్తించారు.
గతంలో నిర్వహించిన సర్వేలో 55 ఎకరాల భూమి రెవెన్యూ, అటవీ భూమి ఉన్నట్లుగా సర్వేలో తేలింది. అయితే ఇందులో అటవీ భూములు లేవని అధికారులు వాదిస్తున్నారు. రెవెన్యూ శాఖ మాత్రం అటవీ భూములు ,రెవిన్యూ భూములు ఉన్నట్లు రికార్డులు చూపిస్తోంది. సజ్జల కుటుంబం భూ సర్వేపై హైకోర్టును ఆశ్రయించింది. రాష్ట్ర ప్రభుత్వం సర్వే నివేదికలు న్యాయస్థానానికి సమర్పించింది. అటవీ భూమి ఉన్నట్లు అందులో పేర్కొంది. మరో మరో సర్వే నిర్వహించి భూముల సరిహద్దులు గుర్తించడంతో పాటు రెవెన్యూ అటవీ భూములను నిర్ధారిస్తామని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది.
అందుకు కోర్టు అనుమతిస్తూ పంట పొలాలకు నష్టం వాటిల్లకుండా యధా స్థితిని కొనసాగించాలని కోర్టు ఆదేశించింది. ప్రభుత్వం అందుకు అంగీకరిస్తూ ముగ్గురు అధికారులతో సమగ్ర సర్వే చేపట్టడం కోసం కమిటీని ఏర్పాటు చేసింది. కడప ఆర్డీవో, కడప డిఎఫ్ఓ, లాండ్స్ అండ్ రికార్డ్స్ ఏడీతో త్రీ మ్యాన్ కమిటీ ఏర్పాటు చేసి సమగ్ర నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ క్రమంలో మరోమారు బుధవారం నుంచి సర్వే జరగనుంది.