Suresh Raina Picks World XI for WCL 2025: ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (డబ్ల్యూసీఎల్) 2025లో టీమిండియా ఆల్‌రౌండర్ సురేశ్ రైనా ఆడుతున్నాడు. జులై 18 నుంచి ఆగస్టు 2 వరకు డబ్ల్యూసీఎల్ జరగనుంది. షెడ్యూల్‌లో భాగంగా నేడు ఇండియా ఛాంపియన్స్, పాకిస్తాన్ ఛాంపియన్స్ మ్యాచ్ జరగాల్సి ఉంది. డబ్ల్యూసీఎల్ 2025లో బిజీలో ఉన్న రైనా.. తన వరల్డ్ ప్లేయింగ్ ఎలెవన్‌ను ఎంచుకున్నాడు. ఆశ్చర్యకరంగా టీమిండియా లెజెండ్స్ ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీలకు రైనా తన జట్టులో చోటు ఇవ్వలేదు. అయితే నలుగురు భారత ఆటగాళ్లను ఎంచుకున్నాడు.
సురేశ్ రైనా తన వరల్డ్ ప్లేయింగ్ ఎలెవన్ జట్టుకు ఓపెనర్లుగా బ్రియాన్ లారా, సచిన్ టెండూల్కర్‌లను ఎంచుకున్నాడు. వివ్ రిచర్డ్స్, గ్యారీ సోబర్స్‌లను టాప్ ఆర్డర్‌లో తీసుకున్నాడు. యువరాజ్ సింగ్, ఇయాన్ బోథమ్, ఆండ్రూ ఫ్లింటాఫ్‌లను ఆల్‌రౌండర్ కోటాలో చోటిచ్చాడు. రైనా నలుగురు స్పెషలిస్ట్ స్పిన్నర్లను జట్టులోకి తీసుకున్నాడు. షేన్ వార్న్, హర్భజన్ సింగ్, అనిల్ కుంబ్లే, సక్లైన్ ముస్తాక్‌లను ఎంపిక చేసుకున్నాడు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా పాల్ ఆడమ్స్‌కు ఛాన్స్ ఇచ్చాడు. ఇంపాక్ట్ ప్లేయర్ కూడా స్పిన్నర్ కావడం ఇక్కడ విశేషం.
సురేష్ రైనా వరల్డ్ ఎలెవన్ జట్టు:
బ్రియాన్ లారా, సచిన్ టెండూల్కర్, వివియన్ రిచర్డ్స్, గ్యారీ సోబర్స్, యువరాజ్ సింగ్, ఇయాన్ బోథమ్, ఆండ్రూ ఫ్లింటాఫ్, షేన్ వార్న్, హర్భజన్ సింగ్, అనిల్ కుంబ్లే, సక్లైన్ ముస్తాక్, పాల్ ఆడమ్స్ (ఇంపాక్ట్ ప్లేయర్).