Supriya Sule: డీలిమిటేషన్ బిల్లుపై సుప్రియా సూలే కీలక వ్యాఖ్యలు

  • 20 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
  • ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత మారిన సీన్
  • డీలిమిటేషన్ బిల్లుపై సుప్రియా సూలే కీలక వ్యాఖ్యలు
Supriya Sule

Supriya Sule

ఈనెల 20 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టనుంది. ముఖ్యంగా డీలిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టనుంది. గత సమావేశాల్లో విపక్ష పార్టీలు వ్యతిరేకించాయి. అయితే ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత సీన్ మారిపోయింది. ఇండియా కూటమి నుంచి డీఎంకే దూరమైంది. ఈ నేపథ్యంలో బిల్లుకు మద్దతు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇక విపక్ష కూటమిలో భాగమైన శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ (ఎస్పీ) కూడా ఈసారి డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వొచ్చన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ వార్తలపై ఎన్సీపీ (ఎస్పీ) ఎంపీ సుప్రియా సూలే స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం మీడియాలో వస్తున్న కథనాలు కేవలం ఊహాగానాలేనని, ఈ అంశంపై పార్టీ ఎలాంటి అధికారిక నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు.

బుధవారం మీడియాతో మాట్లాడిన సుప్రియా సూలే.. డీలిమిటేషన్ అంశంపై ఇప్పటివరకు తమ పార్టీ ఎవరితోనూ చర్చలు జరపలేదని, తమను కూడా ఎవరూ సంప్రదించలేదని తెలిపారు. బిల్లు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన తర్వాత దానిని పూర్తిగా అధ్యయనం చేసి పార్టీ అధికారిక వైఖరిని ప్రకటిస్తామని చెప్పారు. అలాగే ఇండియా కూటమిలోని భాగస్వామ్య పార్టీలతో కూడా ఈ అంశంపై చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. డీలిమిటేషన్ ప్రక్రియను కేవలం జనాభా ప్రాతిపదికన చేపడితే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరిగే ప్రమాదం ఉందని సుప్రియా సూలే అభిప్రాయపడ్డారు. అందువల్ల లోక్‌సభ స్థానాల సంఖ్యను అన్ని రాష్ట్రాల్లో సమానంగా 50 శాతం పెంచేలా బిల్లులో నిబంధన ఉంటేనే తమ పార్టీ మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. డీఎంకే, సమాజ్‌వాదీ పార్టీతో పాటు తమ పార్టీ కూడా ఇదే అభిప్రాయాన్ని గతంలో వ్యక్తం చేసిందని గుర్తు చేశారు. ఇండియా కూటమి డీలిమిటేషన్‌ను డిమాండ్ చేయలేదని, మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేయడమే తమ ప్రధాన డిమాండ్ అని పేర్కొన్నారు.

గత బడ్జెట్ సమావేశాల సందర్భంగా కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తనతో పాటు అసదుద్దీన్ ఒవైసీ, అరవింద్ సావంత్‌లను చర్చలకు ఆహ్వానించారని సుప్రియా సూలే వెల్లడించారు. అనంతరం తాము కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కిరణ్ రిజిజుతో సమావేశమయ్యామని తెలిపారు. అయితే ప్రతిపక్ష పార్టీలన్నింటినీ ఒకేసారి సమావేశానికి పిలవాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నాయకత్వంలో అమిత్ షాకు లేఖ రాసినట్లు చెప్పారు.

ఇదిలా ఉండగా పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ బిల్లుకు శరద్ పవార్ వర్గం మద్దతు ఇవ్వొచ్చన్న వార్తలు ఇటీవల వెలువడ్డాయి. దీంతో ఎన్సీపీ (ఎస్పీ) జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డీఏ)తో చేతులు కలపబోతుందన్న ఊహాగానాలు కూడా వినిపించాయి. ఇటీవల అజిత్ పవార్ వర్గానికి చెందిన ఎన్సీపీ నేతలు ప్రఫుల్ పటేల్, సునీల్ తట్కరే మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ ఆయన అధికారిక నివాసంలో కలవగా.. అనంతరం శరద్ పవార్ వర్గానికి చెందిన జయంత్ పాటిల్ కూడా అక్కడికి చేరుకోవడం రాజకీయ చర్చకు దారితీసింది. అలాగే కొద్ది రోజుల క్రితం శరద్ పవార్ ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే కార్యాలయంలో తన పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం కావడం కూడా రాజకీయ పునర్వ్యవస్థీకరణపై ఊహాగానాలకు కారణమైంది. అయితే ఈ ప్రచారాన్ని శరద్ పవార్ వర్గం, అధికార మహాయుతి కూటమి రెండూ ఖండించాయి.

 

https://x.com/ANI/status/2077293573389832636