ఢిల్లీ – తెలంగాణలో లోకల్ కోటా కింద ఉన్నత విద్య అభ్యసించాలని అనుకుంటున్నారా అయితే ఒక్క క్షణం ఆగండి. స్థానికత అంశంపై సుప్రీంకోర్ట్ సంచలన తీర్పునిచ్చింది. తెలంగాణలో వరుసగా 9 ,10, 11,12 తరగతులు చదువితేనే లోకల్ అంటూ స్పష్టం చేసింది. అయితే ఈ రూల్స్ లో ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు మాత్రం మినహాయింపు ఉంటుందనే షరతు పెట్టింది సుప్రీం కోర్ట్. లోకల్ రిజర్వేషన్ అంశంపై తెలంగాణకు ఊరట కలిగించేలా సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. వరుసగా నాలుగేళ్లు అంటే 9వ, 10వ, 11వ, 12వ తరగతులు తెలంగాణలో చదివితేనే స్థానికుడిగా పరిగణించాలని స్పష్టంచేసింది. అయితే, ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు మాత్రం మినహాయింపు ఇచ్చింది. స్థానికత అంశంలో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీఓ నెంబర్ 33కి అత్యున్నత న్యాయస్థానం పూర్తి స్థాయి మద్దతు తెలిపింది.
తెలంగాణలో స్థానిక రిజర్వేషన్ల అంశం ఎప్పటి నుంచో వివాదాస్పదంగా కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీఓ 33 ప్రకారం ఇంటర్మీడియట్‌కు ముందు వరుసగా నాలుగేళ్లు చదివిన విద్యార్థులనే స్థానికులుగా పరిగణించాలని స్పష్టం చేసింది. కానీ, కొందరు విద్యార్థులు దీన్ని సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ప్రతి రాష్ట్రం తన స్థానిక రిజర్వేషన్ల కోసం తగిన నిబంధనలు రూపొందించుకునే అధికారం ఉందని సుప్రీంకోర్టులో తెలంగాణ రాష్ట్రం వాదనలు వినిపించింది.
అయితే రాష్ట్ర విభజన తర్వాత తమ పిల్లలు మరో రాష్ట్రంలో చదవాల్సి వచ్చిందని అభ్యర్థుల తరపున వాదనలు వినిపించారు పిటిషనర్లు. అయితే ఇప్పటికే రాష్ట్రంలో లోకల్ కోటా పై జీవో 33 ను అమలు చేస్తున్నామని తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు విన్నవించింది. అయితే ప్రభుత్వ ఉద్యోగులు తప్పని పరిస్థితుల్లో ఇతర రాష్ట్రాల్లో పని చేస్తున్నారని..దాంతో వాళ్ళ పిల్లలకు జీవో 33 నుంచి మినహాయింపు ఇస్తామని ప్రభుత్వం కోర్టుకు చెప్పింది. రాష్ట్రప్రభుత్వం చెప్పిన అంశాలను పరిగణలోకి తీసుకున్న సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ బి ఆర్ గవాయ్ ధర్మాసనం తీర్పు వెల్లడించింది.
Also Read:Nargis Fakhri : రహస్యంగా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ హాట్ బ్యూటీ..
అయితే గతేడాది హైకోర్ట్ ఇచ్చిన తాత్కాలిక మినహాయింపుతో స్థానిక కోటా కింద ప్రయోజనం పొందిన విద్యార్థులు తమ ప్రయోజనాలను కొనసాగించవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇకపై ఎంబీబీఎస్, బీడీఎస్ యూజీ కోర్సులలో జీవో 33 ప్రకారమే స్థానిక కోటా రిజర్వేషన్లు అమలుకానున్నాయి. అయితే ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు మాత్రమే జీవో 33 నుంచి మినహాయింపు ఇస్తామనడంపై ప్రైవేటు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము కూడా తప్పని పరిస్థితుల్లోనే రాష్ట్రాన్ని వదిలి ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేయాల్సి వస్తుందని తమ పిల్లల భవిష్యత్ గురించి ప్రభుత్వము కోర్టులు ఆలోచించాలని వేడుకుంటున్నారు.