Supreme Court: సీజేపీకి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ.. ఉద్యమంపై ప్రధాన న్యాయమూర్తి సంచలన వాఖ్యలు..

Supreme Court

Supreme Court

Supreme Court: పార్లమెంట్ మార్చ్ సందర్భంగా విద్యార్థి నిరసనకారులపై పోలీసుల చర్యలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. “మాకు వీడియోలు చూసే ఆసక్తి లేదు, అంత సమయం కూడా లేదు” అని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్య కాంత్ వ్యాఖ్యానిస్తూ, కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనలపై జోక్యం చేసుకోవాలన్న అభ్యర్థనను తోసిపుచ్చారు. బుధవారం నాటి విచారణలో ఓ లాయర్ ఈ అంశాన్ని సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట ప్రస్తావిస్తూ, కోర్టు ఈ విషయాన్ని సుమోటోగా స్వీకరించాలని కోరారు. అయితే ధర్మాసనం అందుకు స్పష్టంగా నిరాకరించింది. “మా సమయాన్ని వృథా చేయకండి, మీ సమయాన్ని కూడా పాడుచేసుకోకండి” అని లాయర్‌కు సీజేఐ హితవు పలికారు.

నీట్-యుజి (NEET-UG) 2026 పేపర్ లీక్, పరీక్షల నిర్వహణ తీరు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ)లో సంస్కరణలు వంటి ప్రజా ప్రాముఖ్యత ఉన్న అంశాలపైనే విద్యార్థులు ఆందోళన చేస్తున్నారని న్యాయవాది వాదించగా, “థ్యాంక్యూ వెరీ మచ్” అంటూ సీజేఐ ఆయన వాదనను అక్కడితో ముగించారు. అనంతరం, పోలీసుల అతిక్రమణలకు సంబంధించి లభ్యమైన వీడియోలను పరిశీలించాలని లాయర్ మళ్లీ కోరగా, “మాకు సమయం లేదు, ఆ వీడియోలు మేం చూడాలనుకోవడం లేదు” అని సీజేఐ తేల్చి చెప్పారు.

కాగా, పోలీసుల చర్యలను సవాల్ చేస్తూ దాఖలైన ఇలాంటి పిటిషన్‌పై అత్యవసర విచారణ జరిపేందుకు మంగళవారమే ఢిల్లీ హైకోర్టు కూడా నిరాకరించిన సంగతి తెలిసిందే. “కోర్టును ఈ వ్యవహారంలోకి లాగవద్దు” అని హైకోర్టు స్పష్టం చేసింది. నీట్-యుజి పేపర్ లీక్, ఇతర పరీక్షల అక్రమాలపై ‘కాక్రోచ్ జనతా పార్టీ’ ప్రధానంగా నిరసనలు నిర్వహిస్తోంది. నిరుద్యోగ యువత జర్నలిజం, సామాజిక ఉద్యమాల వైపు రావడంపై గతంలో సీజేఐ సూర్య కాంత్ స్పందిస్తూ ‘కాక్రోచ్’ (బొద్దింకలు) అనే పదాన్ని వాడగా, ఆ వ్యాఖ్యల ఆధారంగానే ఈ వ్యంగ్య వేదిక ఏర్పడటం గమనార్హం. ఆ వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత రావడంతో, తాను నకిలీ డిగ్రీలు ఉన్న వారిని ఉద్దేశించి మాత్రమే ఆ మాట అన్నానని సీజేఐ తదనంతరం వివరణ ఇచ్చారు.