పెళ్లి తర్వాత ఓ మహిళను ఉద్యోగం నుంచి తొలగించడాన్ని సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్రంగా తప్పుపట్టింది. లింగ వివక్షను చూపే ఏ చట్టాన్ని రాజ్యాంగం అనుమతించబోదని న్యాయస్థానం స్పష్టం చేసింది. సైన్యంలో నర్సుగా (Army Nurse) సేవలు అందిస్తోన్న ఓ మహిళను వివాహం (Marriage) అనంతరం తొలగించిన కేసు విచారణలో భాగంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. అలాగే బాధిత మహిళకు రూ.60 లక్షల బకాయిలు చెల్లించాలని కేంద్ర ప్రభుత్వానికి ఆదేశించింది.
సెలినా జాన్ అనే నర్సు సైన్యంలో విధులు నిర్వహిస్తూ ఉండేది. అయితే పెళ్లి తర్వాత ఆమెను 1988లో విధుల నుంచి తొలగించారు. అప్పుడు ఆమె సైన్యంలో లెఫ్టినెంట్ హోదాలో ఉన్నారు. తనను అకారణంగా ఉద్యోగంలోంచి తొలగించడంపై 2012లో సాయుధ దళాల ట్రైబ్యునల్‌ను ఆశ్రయించింది. ఆమెను తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ కోర్టు తీర్పు ఇచ్చింది. ఆ ఆదేశాలను 2019లో అత్యున్నత న్యాయస్థానం (Supreme Court)లో కేంద్రం సవాలు చేసింది. ఇరు వర్గాల వాదనలు విన్న జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం తీర్పు వెలువరించింది.
ట్రైబ్యునల్ తీర్పులో ఎలాంటి జోక్యం అవసరం లేదని ధర్మాసనం తేల్చిచెప్పింది. 1977లో ప్రవేశపెట్టిన రూల్‌ను వివాహ కారణాలతో మిలటరీ నర్సింగ్ సర్వీస్ నుండి తొలగించడాన్ని అనుమతించే నిబంధనను 1995లో ఉపసంహరించుకున్నట్లు ఈ సందర్భంగా కోర్టు పేర్కొంది. బాధితురాలు ప్రైవేటుగా కొంతకాలం నర్స్‌గా పనిచేసిన విషయాన్ని గుర్తుచేసింది. అయితే తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పును సవరించింది. ఆమెకు బకాయిల రూపంలో రూ.60లక్షలు చెల్లించాలని కేంద్రాన్ని ఆదేశించింది. సుప్రీం ఆదేశాలు అందిన ఎనిమిది వారాల్లోగా ప్రభుత్వం ఈ చెల్లింపులు చేయాలని ఆదేశించింది.