ఈ నెలలో భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జరగనుంది. అక్టోబర్‌లో న్యూజీలాండ్‌తో భారత్ మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది. ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య నవంబర్ నుంచి ఐదు టెస్టుల సిరీస్ ఆరంభం కానుంది. ఈ సిరీస్‌కు మరో రెండున్నర నెలల సమయం ఉంది. అయితే ఇప్పట్నుంచే ఇరు దేశాల మాజీలు మాటల యుద్ధం మొదలు పెట్టారు. రవి శాస్త్రి, రికీ పాంటింగ్, జెఫ్ లాసన్ వంటి మాజీలు తమ అభిప్రాయాలతో మైండ్ గేమ్ స్టార్ట్ చేశారు. తాజాగా భారత్, ఆస్ట్రేలియా పోరుపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మిడ్-డే కోసం రాసిన కాలమ్‌లో సునీల్ గవాస్కర్ పలు విషయాలపై స్పందించారు. ‘ఆస్ట్రేలియాకు వెళ్లే ముందు భారత్ స్వదేశంలో 5 టెస్టులు ఆడనుంది. ఆసీస్ టెస్ట్ సిరీస్ కోసం సిద్ధం కావడానికి మంచి అవకాశం దొరికింది. ఇప్పటికే ఇరు జట్ల మధ్య మైండ్ గేమ్స్ మొదలయ్యాయి. మాజీలు తమ మాటలకు పదును పెట్టారు. గ్లెన్ మెక్‌గ్రాత్ కూడా ఆసీస్ సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేస్తుందని గట్టిగా చెప్పలేకపోతున్నాడు. ఆసీస్ గెలుస్తుందని మాత్రమే చెబుతున్నాడంటే.. భారత్ ఎలాంటి పోటీనిస్తుందో మనం అర్ధం చేసుకోవచ్చు’ అని సన్నీ పేర్కొన్నారు.
Also Read: Kanguva Release Date: ఆ సినిమా రిలీజ్‌కు దారి ఇవ్వాలి.. కంగువ విడుదలపై సూర్య ఆసక్తికర కామెంట్స్!
‘గత టెస్ట్ సిరీస్‌లో ఆడిన ఆటగాళ్లలో కొందరు ఈసారి ఎంపికవుతారో లేదో చూడాలి. స్టీవ్ స్మిత్, ఆర్ అశ్విన్ మధ్య గతంలో పోటీ ఆసక్తికరంగా ఉండేది. స్మిత్‌ను ఔట్ చేసేందుకు అశ్విన్ ప్రత్యేకంగా అస్త్రాలను సిద్ధం చేసేవాడు. రాబోయే సిరీస్‌లో స్మిత్ ఉంటే.. జస్ప్రీత్ బుమ్రాను ఎదుర్కోవడం అతడికి కష్టమే’ అని సునీల్ గవాస్కర్ చెప్పుకొచ్చారు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో స్మిత్‌ను అశ్విన్ ఎనిమిది సార్లు ఔట్ చేశాడు. స్టువర్ట్ బ్రాడ్ తన కెరీర్‌లో 11 సార్లు మాజీ ఆసీస్ సారథిని పెవిలియన్ చేర్చాడు. గత కొన్నేళ్లుగా ఆసీస్ గడ్డపై భారత్ ఆధిపత్యం చెలాయిస్తున్న విషయం తెలిసిందే.