Sunil Gavaskar on Yuzvendra Chahal Snub In India Squad For Asia Cup 2023: అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ సోమవారం ఆసియా కప్ 2023 కోసం భారత జట్టును ప్రకటించింది. 17 మందితో కూడిన జట్టును బీసీసీఐ సెలక్టర్లు ఎంపిక చేశారు. గాయాల నుంచి కోలుకున్న స్టార్ బ్యాటర్స్ కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ తిరిగి జట్టులోకి వచ్చారు. విండీస్ సిరీస్ సిరీస్‌లో విఫలమయిన సంజు శాంసన్ స్టాండ్ బైగా ఎంపికయ్యాడు. ఇక ఇప్పటివరకు వన్డేల్లో అరంగేట్రం చేయని హైదరాబాదీ ఆటగాడు తిలక్ వర్మకు జట్టులో చోటు దక్కింది.
టీమిండియా మణికట్టు స్పిన్నర్ యుజువేంద్ర చహల్‌కు ఆసియా కప్ 2023 జట్టులో చోటు దక్కలేదు. చహల్ స్ధానంలో ఇటీవలి కాలంలో అద్భుతంగా రాణిస్తున్న కుల్దీప్ యాదవ్‌ను బీసీసీఐ సెలక్టర్లు ఎంపిక చేశారు. తనకు జట్టులో చోటు దక్కకపోడంపై యూజీ ఓ ట్వీట్ కూడా చేశాడు. అయితే చహల్‌ను కాదని కుల్దీప్‌న ఎందుకు ఎంచుకున్నారనే దానిపై టీమిండియా మాజీ కెప్టెన్, కామెంటేటర్ సునీల్ గవాస్కర్ తన అభిప్రాయం తెలిపారు. కుల్దీప్ బ్యాట్‌తో కూడా రాణించగలడమే అతడికి జట్టులో చోటు దక్కేలా చేసిందని సన్నీ అన్నారు.
ఇండియా టూడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ… ‘వెస్టిండీస్ సిరీస్‌లో సంజు శాంసన్ పరుగులు చేసి ఉంటే ఖచ్చితంగా ఆసియా కప్ 2023 జట్టులో ఉండేవాడు. యుజువేంద్ర చహల్ వికెట్లు పడగొట్టి ఉంటే జట్టులో ఉండేవాడు. అయితే కొన్ని సార్లు జట్టు కూర్పు కోసం ఆటగాళ్లపై వేటు తప్పదు. కుల్దీప్ యాదవ్‌కు లోయార్డర్‌లో బ్యాటింగ్ చేసే సత్తా ఉంది. బహుశా ఈ కోణంలోనే సెలక్టర్లు ఆలోచించి ఉంటారు. అంతేకాదు చైనామన్ బౌలర్ కూడా కావడం అతడికి కలిసొచ్చింది. ఈ కారణాలతోనే చహల్‌ను కాదని కుల్దీప్ వైపు బీసీసీఐ సెలక్టర్లు మొగ్గు చూపి ఉంటారు’ అని చెప్పారు.