పవిత్ర పుణ్యక్షేత్రాలకు నిలువైన ఉమ్మడి కర్నూలు జిల్లాలో కొలువైన ఆలయాల్లో ‘శ్రీ దుర్గా భోగేశ్వరా స్వామి’ దేవాలయం ఒకటి. ఈ ఆలయం నంద్యాల పట్టణంలోని గడివేముల మండలం గడిగిరాయి గ్రామ శివారులోని దట్టమైన నల్లమల్ల అడవి ప్రాంతంలో ఉంటుంది. ఈ ఆలయం ప్రత్యేకత ఏంటంటే.. దుర్గాభోగేశ్వరా లింగంగా పూజింపబడే ఈ శివలింగంపై ఏడాదికి ఒక్కసారి కార్తీకమాసంలో సూర్యకిరణాలు లింగంపై పడతాయి.
శ్రీ దుర్గ భోగేశ్వరా స్వామి దేవాలయంలో సూర్యకిరణాలు నేడు శివలింగాన్ని తాకాయి. కార్తీక మాసం చివరి సోమవారం ఆది దేవునిపై సూర్య కిరణాల ప్రసరణ భక్తులకు కనువిందుగా మారింది. ప్రతి ఏడాది కార్తీక మాసం చివరి వారమంతా సూర్య కిరణాలు శివలింగంపై పడుతాయని ఆలయ ప్రధాన అర్చకులు శ్యామ్ సుందర్ శర్మ చెప్పారు. కార్తీ కమాసంలో వచ్చే పౌర్ణమి రోజు మొదలుకుని పదిరోజుల పాటు సూర్యకిరణాలు ఈ విధంగా స్వామిపై పడుతుంటాయని గ్రామస్థులు తెలుపుతున్నారు.
దాదాపుగా కొన్ని వందల ఏళ్ల చరిత్ర గల శ్రీ దుర్గ భోగేశ్వరా స్వామి ఆలయాన్ని పూర్వం జనమే జయ మహారాజు నిర్మించినట్లు ఇక్కడి శిలా శాసనాలు తెలుపుతున్నాయి. ఇక్కడ పూర్వం భోగులు అనే గ్రామం ఉండేదని, అందువల్లే ఈ క్షేత్రానికి భోగేశ్వరక్షేత్రం అని పిలుస్తారు. స్వామి వారి ఆలయంలో ఉన్న పవిత్ర కోనేరులో పుణ్య స్నానము ఆచరించి.. అభిషేకం నిర్వహిస్తే కోరిన కోర్కెలు తీరుతాయట. స్వామికి అభిషేకం నిర్వహిస్తే పిల్లలు లేని దంపతులకు సంతానం కలుగుతుందని ఇక్కడి భక్తుల నమ్మకం.