రాజ్యసభ ఎంపీగా ఎన్ఆర్ నారాయణ మూర్తి సతీమణి సుధామూర్తి ప్రమాణస్వీకారం చేశారు. తన భర్త సమక్షంలో ఆమె రాజ్యసభ ఎంపీగా ప్రమాణస్వీకారం చేశారు. పార్లమెంట్ హౌస్‌లోని తన ఛాంబర్‌లో రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖర్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో పీయూష్ గోయల్, పలువురు కీలక నేతలు పాల్గొన్నారు.
ఇటీవలే సుధామూర్తి.. రాష్ట్రపతి కోటాలో రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యారు. గురువారం ఆమె రాజ్యసభ ఎంపీగా ప్రమాణం చేశారు.
ఇన్ఫోసిస్ ఫౌండేషన్ మాజీ చైర్‌పర్సన్, రచయిత్రి సుధామూర్తి పిల్లల కోసం అనేక పుస్తకాలను రచించారు.. కన్నడ, ఇంగ్లీష్ సాహిత్యానికి ఆమె చేసిన కృషికి సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం కూడా లభించింది. అంతే కాకుండా ఈమెను 2006లో పద్మశ్రీ, 2023లో పద్మ భూషణ్ అవార్డులు వరించాయి.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సుధామూర్తి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ఆమెను రాజ్యసభకు ఎంపిక చేశారు. TELCOతో పనిచేసిన మొదటి మహిళా ఇంజనీర్ అయిన సుధామూర్తి.. నేడు వేలకోట్ల సామ్రాజ్యంగా మారిన ఇన్ఫోసిస్ ప్రారంభానికి ప్రధాన కారకురాలు ఆమెనే కావడం విశేషం.
సుధామూర్తి కుమార్తె అక్షత బ్రిటిష్ ప్రధాన మంత్రి రిషి సునక్‌ను వివాహం చేసుకున్నారు. 73 ఏళ్ల సుధామూర్తి అనేక సామాజిక కార్యక్రమాలు కూడా చేస్తుంటారు.