Stock Market Roundup 08-03-23: దేశీయ స్టాక్ మార్కెట్ ఇవాళ బుధవారం ఉదయం నష్టాలతో ప్రారంభమైనప్పటికీ సాయంత్రం లాభాలతో ముగిసింది. ఇంట్రాడేలో నష్టాల నుంచి కోలుకుంది. రెండు కీలక సూచీలకు లాభాలతో శుభం కార్డు పడటం వరుసగా ఇది మూడో రోజు. మార్నింగ్ ట్రేడింగ్‌లో 60 వేల కన్నా దిగువకు వచ్చిన సెన్సెక్స్ ఎట్టకేలకు బెంచ్ మార్క్‌ను దాటింది.
చివరికి.. సెన్సెక్స్ 123 పాయింట్లు పెరిగి 60 వేల 348 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ స్వల్పంగా 42 పాయింట్లు పెరిగి 17 వేల 754 పాయింట్ల వద్ద ఎండ్ అయింది. సెన్సెక్స్‌లోని మొత్తం 30 కంపెనీల్లో 17 కంపెనీలు మంచి పనితీరు కనబరచగా మిగతా 13 కంపెనీలు వెనకబడ్డాయి.
read more: Air India: ఈ ఏడాది 5100 మంది క్యాబిన్ క్రూ, పైలట్ల నియామకం
బీఎస్‌ఈలో ఇండస్ ఇండ్ బ్యాంక్, మహింద్రా అండ్ మహింద్రా, ఎల్‌టీ సంస్థలు లాభపడగా ఎయిర్‌టెల్, నెస్లే ఇండియా, హిందుస్థాన్ యూనీలివర్ కంపెనీలు నష్టాలను చవిచూశాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సున్నా పాయింట్ 3 శాతం వరకు రాణించాయి.
నిఫ్టీలో ఇండస్ ఇండ్ బ్యాంక్ స్టాక్ వ్యాల్యూ 5 శాతం పెరగ్గా అదానీ ఎంటర్‌ప్రైజెస్ మరియు అదానీ పోర్ట్స్ విలువ 3 శాతం పెరిగింది. బజాజ్ ఫైనాన్స్, హిండాల్కో, టెక్ మహింద్రా 2 శాతం వరకు నేలచూపులు చూశాయి.
రంగాల వారీగా చూస్తే నిఫ్టీ ఆటో సూచీ సున్నా పాయింట్ ఎనిమిదీ ఐదు శాతం పెరగ్గా.. రియాల్టీ, ఫార్మా ఇండెక్స్‌లు ఘోరంగా దెబ్బతిన్నాయి. 10 గ్రాముల బంగారం ధర 80 రూపాయలు తగ్గింది. గరిష్టంగా 54 వేల 942 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. కేజీ వెండి రేటు 321 రూపాయలు కోల్పోయింది.
అత్యధికంగా 61 వేల 885 రూపాయలు పలికింది. క్రూడాయిల్ ధర స్వల్పంగా 57 రూపాయలు మైనస్ అయింది. ఒక బ్యారెల్ ముడిచమురు 6 వేల 352 రూపాయలుగా నమోదైంది. రూపాయి వ్యాల్యూ 13 పైసలు బలహీనపడింది. డాలరుతో పోల్చితే మారకం విలువ 82 రూపాయల 7 పైసల వద్ద స్థిరపడింది.