K.Vishwanath: యాక్షన్ హీరోగా సాగుతున్న కృష్ణను నటునిగా తీర్చిదిద్దింది విశ్వనాథ్ అనే చెప్పాలి. అంతకు ముందు బాపు దర్శకత్వంలో కృష్ణ ‘సాక్షి’ వంటి సినిమాలో నటునిగా మార్కులు సంపాదించినా, కృష్ణను వైవిధ్యంగా చూపించింది విశ్వనాథే! కృష్ణ కెరీర్ లో నెగటివ్ షేడ్స్ తో నటించిన ఏకైక చిత్రం విశ్వనాథ్ రూపొందించిన ‘ప్రైవేటు మాష్టారు’. తరువాత ‘ఉండమ్మా బొట్టు పెడతా’లోనూ కృష్ణ తన ఇమేజ్ కు భిన్నమైన పాత్రలో కనిపించారు. ఇక కృష్ణను విలక్షణమైన పాత్రలో ‘నేరము-శిక్ష’లో తీర్చిదిద్దారు విశ్వనాథ్.
ఆ రోజుల్లో విశ్వనాథ్ కథలకు తగ్గ హీరోగా నిలచింది శోభన్ బాబు అనే చెప్పాలి. అలాగే విశ్వనాథ్ చిత్రాలతోనే శోభన్ బాబు సైతం వైవిధ్యం ప్రదర్శించారు. తన ‘ప్రేవేటు మాష్టారు’లో చిన్నపాత్రలో శోభన్ ను నటింప చేసిన విశ్వనాథ్, తరువాత ‘నిండు హృదయాలు’లో యన్టీఆర్ తమ్ముని పాత్రలో నటించేలా చేశారు. ఆ పై శోభన్ బాబు హీరోగా ‘చెల్లెలి కాపురం’ తెరకెక్కించారు. ఈ సినిమాలో శోభన్ డీ గ్లామర్ రోల్ లో కనిపించారు. ఈ సినిమా అనూహ్య విజయం సాధించింది. ఆ తరువాత విశ్వనాథ్ దర్శకత్వంలో శోభన్ బాబు “కాలం మారింది, శారద, జీవనజ్యోతి, ప్రేమబంధం, జీవితనౌక, కాలాంతకులు” వంటి చిత్రాలలో హీరోగా నటించారు. వీటిలో ‘జీవనజ్యోతి’ బిగ్ హిట్ గానిలచి, పలు అవార్డులూ రివార్డులూ కూడా సొంతం చేసుకుంది. చిత్రమేమిటంటే, ఆ రోజల్లో శోభన్ ను అందరూ క్లాస్ హీరో అనేవారు. ఇక విశ్వనాథ్ కళకే విలువ ఇస్తూ సాగారు. అలాంటి వీరిద్దరి కలయికలో ‘కాలాంతకులు’ చిత్రం మాస్ మసాలాలతో రూపొందింది. ఇందులోని ఫైట్స్ ను కె.యస్.ఆర్.దాస్ రూపొందించారు. అలాగే కృష్ణంరాజు హీరోగా విశ్వనాథ్ ‘అల్లుడు పట్టిన భరతం’ అనే మాస్ మూవీ తెరకెక్కించారు. ఇందులో రెబల్ స్టార్ తన ఇమేజ్ కు భిన్నమైన పాత్రలో నటించడం విశేషం!
K Vishwanath : ఆ ఇద్దరితో విశ్వనాథ్!
అప్పటి దాకా చిన్నచిన్న పాత్రలతోసాగుతున్న చంద్రమోహన్ కు కె.విశ్వనాథ్ చిత్రాలే హీరోగా మంచి గుర్తింపు సంపాదించి పెట్టాయి. “ఓ సీత కథ, సిరిసిరిమువ్వ, సీతామాలక్ష్మి, శంకరాభరణం, శుభోదయం” వంటి చిత్రాలలో చంద్రమోహన్ నాయక పాత్రల్లో కనిపించారు. ఫైట్స్ డాన్సులతో రాణిస్తున్న చిరంజీవి, నటునిగా పేరు సంపాదించాలని తపించి మరీ కె.విశ్వనాథ్ దర్శకత్వంలో ‘శుభలేఖ’లో నటించారు. ఈ సినిమాతోనే నటునిగా చిరంజీవి మంచి మార్కులు సంపాదించారు. ఆ తరువాత చిరంజీవి మెగాస్టార్ గా నిలచినా, విశ్వనాథ్ ఆయనతో రూపొందించిన “స్వయంకృషి, ఆపద్బాంధవుడు” చిత్రాలతోనే ఉత్తమనటునిగా నంది అవార్డులు సొంతం చేసుకున్నారు. బాలకృష్ణ హీరోగా అడుగు పెట్టిన తొలి సంవత్సరంలోనే విశ్వనాథ్ రూపొందించిన ‘జననీజన్మభూమి’లో నటించారు. అలాగే తన తొలి రోజుల్లో వెంకటేశ్ విశ్వనాథుని ‘స్వర్ణకమలం’లో నటించి నటునిగా మంచిమార్కులు సంపాదించారు. ఆ పై విశ్వనాథ్ దర్శకత్వంలో వెంకటేశ్ ‘చిన్నబ్బాయ్’లోనూ నటించారు.
యాంగ్రీ యంగ్ మేన్ గా తరువాత పేరు సంపాదించిన రాజశేఖర్ విశ్వనాథ్ దర్శకత్వంలో ‘శ్రుతిలయలు’లో నటించి ఆకట్టుకున్నారు. తమిళనాట స్టార్ హీరోగా సాగుతున్న కమల్ హాసన్ విశ్వనాథుని దర్శకత్వంలో నటించిన “సాగరసంగమం, స్వాతిముత్యం” చిత్రాలతోనే తెలుగువారి మదిలో మరింత విశేషస్థానం సంపాదించారు. కమల్, విశ్వనాథ్ దర్శకత్వంలో ‘శుభసంకల్పం’లోనూ నటించారు.