Srishti Fertility Centre Surrogacy Scam: సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు. సరోగసి పేరిట మోసాలకు పాల్పడుతున్న ఈ కేసులో 17 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్నటితో డాక్టర్ నమ్రత కస్టడీ విచారణ ముగిసింది. డాక్టర్ నమ్రత చెప్పిన వివరాలను పోలీసులు రికార్డు చేశారు. ఐదు రోజల పాటు విచారించిన పోలీసులు.. ఆమె నుంచి విషయాలను రాబట్టారు. ఇక ఈరోజు A3 కల్యాణి, A6 సంతోషిల కస్టడీ విచారణ ముగియనుంది. కల్యాణి, సంతోషిలు ఏం చెబుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
డాక్టర్ నమ్రత పేదరికంలో మగ్గుతున్న భార్యాభర్తలకు డబ్బులిచ్చి బిడ్డల్ని కొంటున్నట్లుగా పోలీసులు గుర్తించారు. కొన్న బిడ్డలను సరోగసి ద్వారా పుట్టారంటూ.. ఫెర్టిలిటీ సెంటర్‌కు వచ్చే దంపతులకు అప్పగించేది. సృష్టి కేసులో అరెస్ట్ అయిన వారిలో ల్యాబ్ టెక్నిషియన్, డాక్టర్లు, ఏఎన్ఎమ్, ఏజెంట్స్ ఉన్నారు. విశాఖపట్నం నుంచి హైదరాబాద్, హైదరాబాద్ నుంచి విశాఖపట్నంకు.. ఇలా దంపతులకు డాక్టర్ నమ్రత సరోగోసి ఎర వేసింది. గ్రామీణ ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహించి.. డెలివరీకి ఉన్న వారి ఆర్థిక స్థోమతలు చూసి ఎర వేసినట్లు దర్యాప్తులో తేలింది. చైల్డ్ ట్రాఫికింగ్ అంశాలపై గోపాలపురం పోలీసుల విచారణ ఇంకా కొనసాగుతోంది.
Also Read: MLC Kavitha: ఢిల్లీలో దొంగ దీక్షలు కాదు.. నిజమైన దీక్షలు చేయాలి!
పిల్లలను ఆమ్మే పలు గ్యాంగులతో డాక్టర్ నమ్రతకు లింకులు ఉన్నట్లు పోలీసులు విచారణలో తేల్చారు. మహారాష్ట్ర, అహ్మదాబాద్, ఏపీకి చెందిన పలు పిల్లలను దొంగిలించే గ్యాంగులతో నమ్రతకు సంబంధాలు ఉన్నాయి. 3-5 లక్షలు ఇచ్చి గ్యాంగుల నుంచి పిల్లల్ని కొనుగోలు చేసేదని తేలింది. ఐవీఎఫ్ కోసం వచ్చే దంపతులను సరోగసి వైపు మళ్లించి.. భారీగా అక్రమాలకు పాల్పడినట్లు వెల్లడైంది. తాజాగా ఐదుగురు బాధితులను సరోగసి పేరుతో మోసం చేసి.. వారి నుంచి పెద్ద మొత్తంలో డాక్టర్ నమ్రత డబ్బు వసూలు చేశారని స్పష్టం అయింది. సరోగసి పేరుతో బాధితుల నుంచి ఇటీవల 44 లక్షలు, 18 లక్షలు, 25 లక్షలు, 50 లక్షలు వసూల్ చేసినట్లు తెలుస్తోంది.