Hyderabad: శ్రీశైలం హైవే రెడ్ లైట్ ఏరియాగా మారుతోంది? హైదరాబాద్‌లోని పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో హిజ్రాల ఆగడాలు స్థానికులు, ప్రయాణికులను తీవ్ర అసౌకర్యానికి గురి చేస్తున్నాయి. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు రహదారిపై అర్ధనగ్నంగా నిలబడి అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. హిజ్రాలు వాహనదారులను ఇబ్బందులకు గురి చేస్తున్న ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. కుటుంబ సభ్యులతో ప్రయాణిస్తున్న వారు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. హైవేపై ఇలాంటి దృశ్యాలు చూసి మహిళలు, పిల్లలు భయపడుతున్నారని వాహనదారులు చెబుతున్నారు. స్థానిక ప్రజలు, డ్రైవర్లు పలుమార్లు ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ పెద్దగా చర్యలు కనిపించకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
పహాడీ షరీఫ్ పరిధిలో ఈ రకమైన ఘటనలు నిరంతరంగా కొనసాగడం చట్టవ్యవస్థ పట్ల ప్రశ్నలు లేవనెత్తుతోంది. రాత్రి వేళల్లో హైవేపై నిఘా సక్రమంగా లేకపోవడం, పోలీసులు పర్యవేక్షణ పెంచకపోవడంతో పరిస్థితి అదుపు తప్పుతోందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల భద్రత కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని, హైవేపై సీసీటీవీ పర్యవేక్షణను పెంచాలని వాహనదారులు విజ్ఞప్తి చేశారు.