ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించిన మహనీయుడు శ్రీ పొట్టి శ్రీరాములు. నేడు ఆయన 125వ జయంతి. ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, ఎంపీ కేశినేని చిన్ని.. పొట్టి శ్రీరాములును స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పించారు. విజయవాడ సామరంగ్ చౌక్ సెంటర్ వద్ద పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఎంపీ కేశినేని పూలమాల వేసి నివాళులర్పించారు.
తెలుగు వారందరూ నిత్యం స్మరించుకోదగిన మహానుభావుడు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారు అని సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. ‘తెలుగు వారందరూ నిత్యం స్మరించుకోదగిన మహానుభావుడు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారు. ప్రత్యేక రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు చేసిన ఆత్మత్యాగం తెలుగువారి దృఢసంకల్పానికి నిదర్శనం. ఆ మహనీయుని జయంతి సందర్భంగా ఆయన స్మృతికి నివాళులర్పిస్తూ.. ఆ అమరజీవి త్యాగాన్ని స్మరించుకుందాం’ అని పేర్కొన్నారు.
‘ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి, ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళి అర్పిస్తున్నాను. తెలుగురాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన పొట్టి శ్రీరాములు గారి జీవితం అందరికీ ఆదర్శం. ఆయన త్యాగం చిరస్మరణీయం. మహాత్మాగాంధీ బోధించిన సత్యం, అహింస, హరిజనోద్ధరణకు జీవితాంతం కృషి చేశారు. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి ఆశయ సాధన కోసం అందరం పునరంకితమవుదాం’ అని మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు.
తెలుగువారందరూ నిత్యం స్మరించుకోదగిన మహానుభావుడు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములుగారు. ప్రత్యేక రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు చేసిన ఆత్మత్యాగం తెలుగువారి దృఢసంకల్పానికి నిదర్శనం. ఆ మహనీయుని జయంతి సందర్భంగా ఆయన స్మృతికి నివాళులర్పిస్తూ..ఆ అమరజీవి త్యాగాన్ని స్మరించుకుందాం. pic.twitter.com/qg2enAKWgk
— N Chandrababu Naidu (@ncbn) March 16, 2025