SRH Captain Pat Cummins Heap Praise on Nitish Kumar Reddy: తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డిపై సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ప్రశంసల జల్లు కురిపించాడు. నితీష్ అద్భుతం అని, ఫెంటాస్టిక్ ప్లేయర్ అని పొగిడాడు. గత వారంలోనే అరంగేట్రం చేశాడని, ఈ వారంలో బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకు వెళ్లాడని పేర్కొన్నాడు. నితీష్ వల్లే తాము మ్యాచ్ గెలిచామని కమిన్స్ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2024లో భాగంగా మంగళవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నితీష్ మెరుపు హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 37 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 64 పరుగులు చేసి.. సన్‌రైజర్స్ భారీ స్కోర్ సాధించడంలో భాగమయ్యాడు.
మ్యాచ్ అనంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మాట్లాడుతూ… ‘ఇది గొప్ప మ్యాచ్. ఇన్నింగ్స్ ప్రారంభంలో పంజాబ్ బాగా బౌలింగ్ చేసింది. మేం 182 పరుగులు చేయడానికి బాగా కష్టపడ్డాం. పంజాబ్ లక్ష్యానికి చేరువగా వచ్చింది. మేము డిఫెండ్ చేయడానికి కష్టపడ్డాం. ఇంపాక్ట్ ప్లేయర్ వల్ల కలిసొచ్చేది ఇదే. బ్యాటింగ్ ఆర్డర్ లోతుగా ఉంటుంది. కొత్త బంతితో పంజాబ్ విజృంభించింది. 150-160 పరుగులు చేస్తే.. పది మ్యాచ్‌ల్లో తొమ్మిది మ్యాచ్‌లను కోల్పోవచ్చు. కొత్త బంతి కీలకం కాబోతోందని మాకు తెలుసు. మేము 180 పరుగులు చేయడం చాలా సంతోషంగా ఉంది’ అని అన్నాడు.
Also Read: Nitish Reddy Song: మ్యాచ్‌కు ముందు ‘పవన్ కళ్యాణ్’ పాట వింటా: నితీశ్ రెడ్డి
‘పరిస్థితుల కారణంగా నేను కొత్త బంతిని అందుకున్నాను. పంజాబ్ కొత్త బంతితో చేసిన ప్రదర్శన కారణంగానే.. నేను, భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ ప్రారంభించాం. వికెట్లు తీయడానికి ప్రయత్నించాము. మా వద్ద లెఫ్ట్ ఆర్మర్‌లు, రైట్ ఆర్మర్ బౌలర్లు బాగా ఉన్నారు. వారికి అవకాశం ఇచ్చి ఫలితాలు రాబట్టలనుకున్నాం. నితీశ్ రెడ్డి అద్భుతం, ఫెంటాస్టిక్ ప్లేయర్. గత వారంలోనే ఈ సీజన్‌లో అరంగేట్రం చేశాడు. ఈ వారంలో బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకు వెళ్లాడు. ఫీల్డింగ్‌తో కూడా ఆకట్టుకున్నాడు. మూడు ఓవర్లు బౌలింగ్ చేశాడు. బ్యాట్‌తో విజృంభించి జట్టు స్కోరును 182కు చేర్చడం గొప్ప విషయం’ అని కమిన్స్ పేర్కొన్నాడు.