పహల్గాం సమీప బైసరన్ లోయలో ఉగ్రవాదులు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో సైనిక దుస్తుల్లో వచ్చిన ముష్కరులు.. పర్యాటకులపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ ఉగ్రదాడికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. బాధ్యులు తప్పకుండా భారీ మూల్యం చెల్లించుకుంటారని సోషల్ మీడియాలో భారతీయలు పోస్టులు పెడుతున్నారు. ఉగ్రదాడికి వ్యతిరేకంగా నేడు ఐపీఎల్ ప్లేయర్స్ నల్ల రిబ్బన్లతో బరిలోకి దిగనున్నారు.
ఐపీఎల్ 2025లో భాగంగా ఈరోజు సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో ఆటగాళ్లు, అంపైర్లు నలుపు రిబ్బన్లను ధరించి పహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా నిరసన తెలపనున్నారు. ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన వారికి నివాళులు అర్పించనున్నారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు ఆటగాళ్లు, అంపైర్లు ఒక్క నిమిషం మౌనం పాటించనున్నారు. ఉగ్రదాడికి నిరసనగా ఈ మ్యాచ్‌లో ఛీర్ లీడర్స్ కూడా ఉండరు. మ్యాచ్ రాత్రి 7.30కు ఆరంభం కానుంది. ప్రేక్షకులను సాయత్రం 4 గంటల నుంచే లోపలికి అనుమతిస్తారు.