ఆషాఢ మాసం అయిపోయింది.. శ్రావణ మాసం వచ్చేసింది. శ్రావణ మాసం అంటే మహిళలకు ఎంతో ఇష్టమయిన మాసం. ఈ మాసం అంతా పవిత్రమైన మాసంగానే స్త్రీలు భావిస్తారు. స్త్రీలు దోసిట్లో సెనగల మూట, కాళ్ళకు పసుపు రాసుకుంటారు. తలలో వివిధ రకాల పూలు ధరించడం, చేతులకు తోరణాలు, కొత్త చీరలు, పట్టుచీరలతో ప్రకృతి అంతా శోభాయమానంగా అలరారుతుంది. ఏ ఇంట చూసినా పండుగ వాతావరణమే కనబడుతుంది.
పూజలు, వ్రతాలకు కేరాఫ్ అడ్రస్ ఈ శ్రావణం. కొత్తగా పెళ్ళయిన వారు పుట్టింట్లో వివిధ రకాల పూజలు చేస్తారు. ఆషాఢంలో అత్తారింటికి దూరంగా వుంటారు. శ్రావణ శుక్రవారం పూజలు చేసి అత్తారింటికి వెళతారు. వరదలు కారణం గా పూల తోటలు కు భారీ నష్టం వాటిల్లింది. మార్కెట్ లో దేశవాళీ పూల కొరతతో ధరలు ఆకాశాన్నంటాయి. దేశవ్యాప్తంగా కడియపులంక పూల మార్కెట్ నుంచి భారీగా ఎగుమతులు జరుగుతుంటాయి.
కడియపు లంక చుట్టుపక్కల గ్రామాలలో 600కు పైగా నర్సరీలు దేశంలోనే ప్రసిద్ధి గాంచాయి. ఇక్కడి పూల మార్కెట్ నుండి తూర్పు,పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటుగా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు పూల సరఫరా జరుగుతుంది. ఈ మార్కెట్లో హోల్‌సేల్ దుకాణాలు వంద వరకూ వుంటాయి.రెండవ శుక్రవారం అంటే పౌర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీవ్రతం చేస్తారు. ఈ వ్రతం కోసం పూలు, పండ్లు ఎక్కువగా కొనుగోలు చేస్తారు. శ్రావణమాసంలో వచ్చే ప్రతీ రోజు విశేషమైనదిగానే చెప్పుకోవచ్చు. ఈ శ్రావణమాసం శివకేశవులకు అభేదం లేదు అని తెలియజేస్తుంది. ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతుంటాయి. పూల దుకాణాలు కళకళలాడుతుంటాయి.
తూర్పుగోదావరి జిల్లాలోని కడియపు లంక పూల మార్కెట్ సందడిగా మారింది. కడియపులంక శ్రావణ శోభతో అలరారుతోంది. ఒకవైపు గోదావరి వరద, ఎడతెరిపి లేని వర్షాలతో కడియపులంకలో పూల దిగుబడి గణనీయంగా తగ్గింది. తొలి శ్రావణ శుక్రవారం, పెళ్లిళ్లు సీజన్ స్టార్ట్ కావడంతో పూలకు భారీగా డిమాండ్ ఏర్పడింది. ధరలు భారీగా పెరిగాయి. గతంలో చామంతి కేజీ రూ.200 పలకగా బంతి రూ.వంద, లిల్లీ రూ.400, మల్లెపూలు రూ.1400, గులాబీ రూ.200, కనకాంబరం బారు రూ.300 కి మించి పలుకుతున్నాయి. స్థానికంగా లభ్యమయ్యే పూలు కంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే అలంకరణ పూలను ప్రస్తుతం అధిక ధరలకు విక్రయిస్తున్నారు.
