Maha Kumbh Mela 2025: మహా కుంభమేళా..ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్మాత్మిక పండుగ.ప్రారంభమైన తొలి రోజే నుంచి రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. ఎన్నో వింతలు, విశేషాలు,మరెన్నో ప్రత్యేకతలతో ఆకట్టుకుంటోంది.ప్రయాగ్ రాజ్ వెళ్లిన భక్తులకే కాదు..టీవీల ముందు కూర్చుని చూసినోళ్ల గుండెల్లో భక్తిపారవశ్యం ఉప్పొంగుతోంది.అన్నిదారులు ప్రయాగ్ రాజ్ వైపే.ఏ రైలు చూసినా, ఏ బస్సు చూసినా కిటకిటే. ఎవరినోట విన్న కుంభమేళామాటే.స్వయంగా వెళ్లిన వారి ఆనందం మాటల్లో వర్ణించిలేనిది.వెళ్లేదారిలో ఎన్ని కష్టాలు ఎదురైనా,ట్రాఫిక్ లో చుక్కలు కనిపించినా..త్రివేణి సంగమంలో పవిత్రస్నానంతో మాయమైపోతున్నాయి. ఇలా రోజూ లక్షలాది మంది ప్రయాగ్ రాజ్ కు వస్తున్నారు.పుణ్యస్నానాలతో పునీతులవుతున్నారు.ఇక స్పెషల్ డేస్ అయితే అన్ని రికార్డులే.అమృతస్నానాలు ఒకటికి మంచి మరొకటి రికార్డులు బ్రేక్ చేశాయి.శుక్రవారం మావన చరిత్రలో అద్భుతఘట్టం ఆవిష్కృతమైంది.పుణ్యస్నానాలు చేసిన వాళ్ల సంఖ్య 50 కోట్లు దాటింది.
ప్రయాగ్‌రాజ్‌లో కొనసాగుతోన్న కుంభమేళాకు ఊహించని స్థాయిలో భక్తులు వస్తున్నారు. శుక్రవారం సాయంత్రానికి 50 కోట్లకు పైగా భక్తులు త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించినట్లు ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. మానవ చరిత్రలో ఏ మతపరమైన, సాంస్కృతిక లేదా సామాజిక కార్యక్రమంలో ఈ స్థాయిలో జనం పాల్గొనలేదని చెప్పింది. శుక్రవారం ఒక్కరోజే దాదాపు కోటి మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారని, దీంతో ఇప్పటివరకు వచ్చినవారి సంఖ్య 50 కోట్లు దాటిందని యూపీ ప్రభుత్వం తెలిపింది. భారత్, చైనా మినహా అన్ని దేశాల జనాభాను ఈ సంఖ్య దాటేసిందని అంటోంది. ఇక్కడ స్నానాలు చేసిన వారి సంఖ్య అమెరికా, రష్యా, ఇండోనేసియా, బ్రెజిల్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ దేశాల జనాభా కంటే ఎక్కువని తెలిపింది.
ప్రతి 12 ఏళ్లకు ఓసారి నిర్వహించే ఈ మహా కుంభమేళా జనవరి 13న మొదలైంది. ఫిబ్రవరి 26 శివరాత్రి రోజు ముగుస్తోంది. మొత్తం 40 నుంచి 45 కోట్ల మంది రావచ్చని తొలుత అంచనా వేశారు. కానీ అంచనాలకు మించి భక్తులు ప్రయాగ్‌రాజ్‌కు వస్తున్నారు. ప్రపంచం నలుమూలల నుంచి నిత్యం సరాసరి కోటిన్నర మంది వస్తుండటం హైలైట్. జనవరి 29న మౌని అమావాస్య రోజే దాదాపు 8 కోట్ల మంది ప్రయాగ్‌రాజ్‌కు వచ్చినట్లు యూపీ ప్రభుత్వం లెక్కలేసింది. అదే రోజు తెల్లవారుజామున జరిగిన తొక్కిసలాటలో 30 మంది ప్రాణాలు కోల్పోగా మరో 60 మంది గాయపడ్డారు. ఆ తర్వాత మాఘపూర్ణిమకు 3 కోట్ల మంది వచ్చారు.ఇసుకేస్తే రాలనంత జనంతో త్రివేణి సంగమం కిక్కిరిసిపోయింది. మరో 12 రోజులపాటు కొనసాగనుండటంతో భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మహాకుంభమేళా ముగిసే సరికి భక్తుల సంఖ్య 55 కోట్ల దాటొచ్చని అంచనా.ముగింపు సమీపిస్తున్నా భక్తుల మ్రాతం తగ్గడం లేదు. వీకెండ్ వచ్చిందంటే భక్తుల సంఖ్య రెట్టింపు అవుతోంది.ఇక అమృతఘడియలైతే పరిస్థితి చెప్పనక్కర్లేదు.గత వారం 3వందల కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయిందంటేనే రష్ ఎలా ఉందో అర్థమవుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద జామ్ గా ఇది నిలిచింది.ఇక మిగిలింది ఒకే ఒక్క అమృతస్నానం ఈ నెల26.ఇదే రోజు మహాకుంభమేళా ముగుస్తుంది. ముగింపు రోజూ రికార్డ్ స్థాయిలో భక్తులు వచ్చే అవకాశం ఉంది.సగటు రోజుకు అరకోటి వేసుకున్నా..55 కోట్లు దాటుతుంది.ఇప్పటివరకు మానవ చరిత్రలో ఏ మత, సాంస్కృతిక, సామాజిక కార్యక్రమానికి కూడా ఇంత పెద్ద సంఖ్యలో జనం రాలేదు.
జనవరి 29 న తొక్కిసలాట జరిగినప్పటికీ, ప్రతిరోజూ ప్రయాగ్ రాజ్ దేశ,విదేశాల నుంచి మిలియన్ల మంది యాత్రికులు వస్తూనే ఉన్నారు. 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ విశిష్ట మహా కుంభమేళాకు భక్తులు పోటెత్తుతూనే ఉన్నారు. ఈ నెల 26 వరకు త్రివేణి సంగమం – గంగా, యమునా సరస్వతి లు కలిసే త్రివేణి సంగమంలో భక్తులు పెద్దయెత్తున పుణ్యస్నానాలు ఆచరించనున్నారు. ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా..మొదటి రోజునుంచే బారీగా భక్తజనం పోటెత్తింది. తొలిరోజే పౌష్ పూర్ణిమ కావడంతో మొత్తం 1 కోటి 65 లక్షల మంది స్నానాలు చేసినట్లు లెక్కలు చెబుతున్నాయి. అలా ఇప్పటివరకు 50 కోట్లమంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు అధికారులు చెబుతున్నారు. ఇదేదో ఆషామాషీగా చెబుతున్న లెక్కలు కావు.పక్కా డిజిటలైజ్డ్ ఫిగర్స్. కుంభమేళాకు వస్తున్న భక్తుల్ని డిజిటల్ కెమెరాల ద్వారా కౌంటింగ్ చేస్తున్నారు. ఈ ఏడాది నగరవ్యాప్తంగా 2700 కెమెరాలను ఏర్పాటు చేసింది యూపీ ప్రభుత్వం. వీటిలో 1800 కెమెరాలను కుంభమేళా ప్రాంతంలో ఏర్పాటు చేశారు. 1100 పర్మినెంట్ కెమెరాలు కాగా…మిగిలిన700 తాత్కాలిక కెమెరాలు. 270 కంటే ఎక్కువ కెమెరాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AIను ఇన్‌స్టాల్ చేశారు. ఓవ్యక్తి కమెరా సర్కిల్‌లోకి రాగానే ఆటోమేటిక్‌గా కౌంట్ అవుతాడు. ఏఐ కెమెరాలు ప్రతి నిమిషానికి డేటా అప్‌డేట్ చేస్తూ ఉంటాయి. ప్రయాగ్‌రాజ్ చేరుకునేందుకు 7ప్రధాన మార్గాలు ఉన్నాయి. అక్కడి నుంచి త్రివేణి సంగమానికి చేరుకునేందుకు మొత్తం 12 మార్గాలను ఏర్పాటు చేశారు. ఎంట్రెన్స్ ల్లోని కెమెరాలతోనే భక్తుల సంఖ్యని పక్కాగా లెక్కిస్తున్నారు.
మళ్లీ మహాకుంభమేళా చూసే అవకాశం ఈ జనరేషన్ లేదు. ఎందుకంటే ఇది 144 ఏళ్లకోసారి వస్తోంది.అందుకే ఎక్కువమంది ఈ ఛాన్స్ వదులుకోవడం లేదు.ఎలాగైనా కుంభమేళా వెళ్లాతీరాల్సిందేనని ప్రయాగ్ రాజ్ బాటపడుతున్నారు.దీంతో ముగింపు తేదీ సమీపిస్తున్న రష్ తగ్గడం లేదు.ఏ రోజూ చూసినా త్రివేణి సంగమం జనసంద్రమై కనిపిస్తోంది.వీకెండ్ లో అయితే అంతకు మించి భక్తులతో కిక్కిరిసిపోతోంది.ఈ క్రమంలో కుంభమేళా సరికొత్త రికార్డులు క్రియేట్ చేయబోతోంది.