Pat Cummins Says Australia Hero Travis Head: ట్రావిస్ హెడ్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతోనే తమకు అద్భుత విజయాన్ని అందుకున్నామని ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ చెప్పాడు. మ్యాచ్‌లో టాస్ ఓడిపోవడం తమకు కలిసొచ్చిందని, ఇదో అద్భుతమైన మ్యాచ్ అని తెలిపాడు. ప్రపంచకప్ 2023 ఫైనల్ చేరడం చాలా సంతోషంగా ఉందని, భారత్‌లో ఫైనల్ ఆడనుండటం మరింత స్పెషల్ అని కమిన్స్ చెప్పుకొచ్చాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా గురువారం దక్షిణాఫ్రికాతో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 3 వికెట్లతో గెలిచి.. ఫైనల్ చేరింది. ఫైనల్ మ్యాచ్‌లో నవంబర్ 19న భారత్‌తో ఆస్ట్రేలియా తలపడనుంది.
మ్యాచ్ అనంతరం ప్యాట్ కమిన్స్ మాట్లాడుతూ… ‘డగౌట్‌లో కూర్చోవడం కంటే మైదానంలో మ్యాచ్ ఆడడం ఉత్తమం అని నేను భావిస్తున్నాను. రెండు గంటల పాటు నరాలు తెగిపోయే ఉత్కంఠ తర్వాత విజయం సాధించాం. ఇదో అద్భుతమైన మ్యాచ్. మ్యాచ్‌లో టాస్ ఓడిపోవడం కలిసొచ్చిందని చెప్పాలి. ఎందుకంటే బంతి పాత బడిన తర్వాత పిచ్ స్పిన్‌కు అనుకూలిస్తుందని భావించాం. కానీ ఇన్నింగ్స్ ఆరంభంలోనే పేసర్లకు సహకరిస్తుందని ఊహించలేకపోయాం. స్టార్క్, హజెల్ వుడ్ చెలరేగి వికెట్లు తీశారు. కాబట్టి ముందుగా బౌలింగ్ చేయడం గురించి పెద్దగా నిరాశ చెందలేదు’ అని తెలిపాడు.
‘మా ఫీల్డింగ్ టోర్నీ ఆరంభంలో దారుణంగా ఉంది. ఈ మ్యాచ్‌లో మా ప్లేయర్స్ అద్భుతంగా చేశారు. 37 ఏళ్ల వార్నర్ డైవింగ్ చేయడం విశేషం. హెడ్ తీసిన వికెట్ మ్యాచ్‌ను మలుపు తిప్పింది. టోర్నీ ఆసాంతం బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు. ఇంగ్లీస్ స్పిన్నర్లను సమర్థవంతంగా ఎదుర్కొని కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ప్రపంచకప్ ఫైనల్ చేరడం సంతోషంగా ఉంది. జట్టులో చాలా మంది ప్రపంచకప్ ఫైనల్ ఆడిన అనుభవం ఉంది. కొందరు 2015 వన్డే ప్రపంచకప్ ఫైనల్ ఆడితే.. మరికొందరు 2021 టీ20 ప్రపంచకప్ ఫైనల్ ఆడారు. భారత అభిమానులతో పూర్తిగా నిండిపోయే నరేంద్ర మోడీ స్టేడియంలో ఫైనల్ ఆడేందుకు ఉత్సాహంగా ఉన్నాం. 2015 ప్రపంచకప్ ఫైనల్ నా కెరీర్‌కే హైలైట్. భారత్‌లో మరో ఫైనల్ ఆడబోతున్నందుకు చాలా సంతోషంగా ఉన్నాము. ఇక వేచి ఉండలేము’ అని కమిన్స్ అన్నాడు.