Sourav Ganguly Said Indian Cricket Stops for No One: టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత క్రికెట్ ఎవరి కోసమూ ఆగదని, స్టార్ క్రికెటర్లు లేని లోటును యువ ఆటగాళ్లు భర్తీ చేశారు అని పేర్కొన్నారు. దేశంలో ఎంతో మంది ప్రతిభావంతులైన క్రికెటర్లు ఉన్నారు, కుర్రాళ్లు స్టార్ క్రికెటర్లను భర్తీ చేస్తారు అని అన్నారు. ఐపీఎల్, భారత్ ఎ, అండర్-19 టీమ్స్ రూపంలో భారత్‌కు చాలా వేదికలు ఉన్నాయని.. మంచి క్రికెటర్లు జట్టులోకి ఎపుడూ వస్తుంటారు అని దాదా తెలిపారు. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు టెస్ట్ ఫార్మాట్‌కు ఆర్ అశ్విన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించారు. దీంతో భారత్ బ్యాటింగ్ విభాగం బలహీనపడుతుందని అంతా అనుకున్నారు. అయితే కుర్రాళ్లు ఇంగ్లండ్ గడ్డపై అదరగొట్టి సిరీస్‌ను 2-2తో సమం చేశారు. ఈ నేపథ్యంలో దాదా స్పందించారు.
ఓ జాతీయ మీడియాతో సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ… ‘భారత క్రికెట్ ఎవరి కోసం ఆగదు. దేశంలో ఎంతో మంది ప్రతిభావంత క్రికెటర్లు ఉన్నారు. ఇంగ్లండ్ పర్యటనలో భారత్ ఆటగాళ్లు అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. భారత క్రికెట్ ఎప్పటిలానే ఉంది. సునీల్ గవాస్కర్ రిటైర్మెంట్ తర్వాత సచిన్ టెండ్యూలర్ భర్తీ చేశాడు. రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్ కూడా వచ్చారు. ఆపై విరాట్ కోహ్లీ భర్తీ చేశాడు. ఇప్పుడు యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్ ఉన్నారు. భారత క్రికెట్‌లో ఎంతో ప్రతిభ ఉంది. ఎలాంటి ఆందోళన అవసరం లేదు. మన దేశవాళీ క్రికెట్ బలంగా ఉంది. భారత్ ఎ, అండర్-19, ఐపీఎల్ రూపంలో ఎన్నో ప్రత్యామ్యాయలు ఉన్నాయి. ఆటగాళ్లు వస్తూనే ఉంటారు’ అని చెప్పారు.
Also Read: Tragic Incident: గాల్లో ఆగిపోయిన గల్ఫ్ కార్మికుని గుండె.. నేడు కోరుట్లకు మృతదేహం!
‘ఇంగ్లండ్‌లో టీమిండియా అద్భుతంగా ఆడింది. ప్రతి ఒక్కరు బాగా ఆడారు. మాంచెస్టర్ టెస్టులో వెనకపడిన భారత్ పుంజుకుని మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. ఓవల్‌లో గెలిచి సిరీస్‌ను సమం చేసింది. పెద్దగా అనుభవం లేని ప్లేయర్స్ బాగా ఆడారు. చాలా సెంచరీలు, 5 వికెట్స్ హాల్స్ నమోదు అయ్యాయి. కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు అభినందనలు. భారత బ్యాటర్లు కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ అదరగొట్టారు. బౌలింగ్‌లో మహమ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్, ప్రసిద్ కృష్ణ ఆకట్టుకున్నారు’ అని సౌరవ్ గంగూలీ ప్రశంసలు కురిపించారు.