భారత్, పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ అంటే హోరాహోరీగా పోరు ఉంటుంది. ప్రతిక్షణం ఆటగాళ్లలో కసి, అభిమానుల్లో ఎంతో ఆసక్తి, బంతి బంతికి మలుపులు, పతాక స్థాయిలో భావోద్వేగాలు ఉంటాయి. కానీ ఆసియా కప్ 2025లో భాగంగా సెప్టెంబర్ 14న దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఇవేమీ కనిపించలేదు. ఇండో-పాక్ మ్యాచ్ ఏకపక్షంగా సాగింది. భారత్ పూర్తి ఆధిపత్యం కొనసాగిస్తూ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ చూసిన వారికి కాస్త నిరాశే ఎదురైంది. మ్యాచ్ చప్పగా సాగడంతో చాలామంది ఫాన్స్ పూర్తి మ్యాచ్ చూడలేదు. టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ బాస్ సౌరవ్ గంగూలీ కూడా ఇదే చేశారట.
భారత్, పాకిస్థాన్ మ్యాచ్ మీద పెద్దగా ఆసక్తి కలగలేదని, తాను మొదటి 15 ఓవర్లు మాత్రమే చూశానని సౌరవ్ గంగూలీ చెప్పుకొచ్చారు. మ్యాచ్ బోర్ కొట్టి ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ వీక్షించానని దాదా చెప్పారు. ‘నిజానికి నేను భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌ను మొదటి 15 ఓవర్లు చూశాను. బోర్ కొట్టి ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్‌ను చూశా. ఇటీవలి కాలంలో పాకిస్థాన్ కనీస పోటీ ఇవ్వడం లేదు. మ్యాచ్‌లు అన్ని ఏకపక్షంగా సాగుతున్నాయి. ఇండో-పాక్ మ్యాచ్‌ల కంటే భారత్.. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఇంగ్లండ్, శ్రీలంక మ్యాచ్‌లు ఆసక్తిగా ఉంటున్నాయి. చివరకు భారత్, అఫ్గానిస్థాన్ మ్యాచ్‌లు కూడా రసవత్తరంగా సాగుతున్నాయి. ఇప్పుడు భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌లకు హైప్ అవసరం లేదు’ అని దాదా అసహనం వ్యక్తం చేశారు.
Also Read: Gardening Tips: ఇంటి గార్డెన్‌లో ఈ 5 పండ్ల మొక్కలను నాటండి.. సంపూర్ణ ఆరోగ్యంగా ఉండండి!
‘పాకిస్థాన్ ఏ దశలోనూ పోటీ ఇవ్వలేదు. పాక్ జట్టులో నాణ్యమైన ప్లేయర్స్ లేరు. బ్యాటింగ్, బౌలింగ్‌లో పెద్దగా పస లేదు. పాకిస్థాన్ జట్టులో నాణ్యత కొరవడింది. ఉన్న ఒకరిద్దరు కూడా విఫలమయ్యారు. మరోవైపు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా లాంటి స్టార్స్ లేకున్నా భారత్ టోర్నీలో బాగా రాణిస్తోంది. ఆసియా కప్ 2025లో భారత్ అన్ని జట్ల కంటే ఎంతో ముందంజలో ఉంది. టీమిండియా ఎప్పుడూ బెస్ట్ టీమ్’ అని సౌరవ్ గంగూలీ ప్రశంసించారు.
