Haliya: తల్లిని మించిన దైవం లేదు. తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఎంత బాధనైనా భరిస్తూ మనకు జన్మనిస్తుంది. మనకు కష్టమొచ్చిందంటే తల్లిపేగు విలవిలలాడిపోతుంది. అలాంటి తల్లికి ఏమిచ్చానా.. ఎన్ని జన్మలెత్తినా రుణం తీర్చుకోలేము. తల్లి దూరం అయిందంటే ఏ బిడ్డ తట్టుకోలేదు. అలాంటి ఘటనే హాలియాలో చోటు చేసుకుంది. అనారోగ్యం కారణంగా తల్లి మరణించిన గంటల వ్యవధిలోనే కొడుకు చనిపోయాడు. అదీ మదర్స్ డే రోజే కావడం విశేషం. నల్లగొండ జిల్లాలో ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది.
Read Also:TS EAMCET : ముగిసిన ఎంసెట్ పరీక్షలు.. ఈ నెల చివర్లో ఫలితాలు.. నేడు ప్రైమరీ కీ
హాలియా మున్సిపాలిటీ పరిధిలోని ఇబ్రహీంపేటకు చెందిన వందనపు పార్వతమ్మ (95), చంద్రయ్య దంపతులకు కుమారుడు వందనపు ఈశ్వరయ్య (74)తో పాటు ఐదుగురు కుమార్తెలు సంతానం. చంద్రయ్య గ్రామంలోనే కిరాణం ఏర్పాటు చేసుకొని పిల్లలను పెంచి పెద్దచేశాడు. ఆ తర్వాత మంచి సంబంధం చూసి అందరి పెళ్లిళ్లు చేశాడు. పదహారేళ్ల క్రితం చంద్రయ్య అనారోగ్యంతో మృతి చెందాడు. వీరి కుమారుడు ఈశ్వరయ్య ఇబ్రహీంపేటలో నివసిస్తూ కిరాణా దుకాణం నిర్వహిస్తున్నాడు. పార్వతమ్మ, ఈశ్వరయ్య కొంతకాలంగా అనారోగ్యంతో మంచం పట్టారు. బిడ్డ వద్ద ఉంటున్న పార్వతమ్మ తీవ్ర అస్వస్థతకు గురై శనివారం ఉదయం 11 గంటలకు కన్నుమూసింది. అదేరోజు కుమారుడు వందనపు ఈశ్వరయ్య ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో కుటుంబ సభ్యులు నల్లగొండ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం రాత్రి 11 గంటలకు ఈశ్వరయ్య మృతి చెందాడు. తల్లి, కొడుకు ఒకే రోజు 12 గంటల వ్యవధిలో మృతి చెందడంతో ఇబ్రహీంపేట గ్రామంలో విషాదం నెలకొంది.
Read Also:Manipur: మిజోరాంలో తలదాచుకున్న 5,800 మంది మణిపూర్ వాసులు