Software Job Scam: ఉద్యోగాలిస్తామని చెప్పి నిరుద్యోగుల దగ్గర డబ్బులు వసూలు చేసి బోర్డు తిప్పేసింది ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ. ఈ ఘటన నంద్యాలలో చోటుచేసుకుంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల పేరిట రూ.98 లక్షలను కాజేసి ఎస్.ఎల్.సి సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సాఫ్ట్‌వేర్ సంస్థ బోర్డు తిప్పేసింది. నంద్యాలలోని టీటీడీ రోడ్డులో ఏడాదిన్నర క్రితం ఉప్పరి వెంకట్, మరో నలుగురు వ్యక్తులు సంస్థను ఏర్పాటు చేశారు.
Read Also: Road Accident: మట్టి లోడుతో వెళ్తున్న టిప్పర్, స్కూటీ ఢీ.. ముగ్గురు మృతి
ఐటీ రంగంలో శిక్షణ, ఉద్యోగ కల్పన చేస్తామని సంస్థ ప్రతినిధులు ప్రచారం చేశారు. నాలుగైదు మందికి ఉద్యోగాలు రావడంతో సంస్థపై నిరుద్యోగుల్లో నమ్మకం పెరిగింది. ఒక్కరి నుంచి రూ 1.20లక్షల చొప్పున 76 మంది నుంచి రూ 98 లక్షలను సంస్థ ప్రతినిధులు వసూలు చేశారు. ఉద్యోగాలు ఇప్పించకుండా, డబ్బు వాపస్ ఇవ్వకుండా సంస్థ ప్రతినిధులు ముఖం చాటేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఉప్పరి వెంకట్, హైదరాబాద్‌లోని గిజిలీజ్ సాఫ్ట్ వేర్ కంపెనీ సీఈవో రవి చంద్రా రెడ్డి, మరో ఇద్దరిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ప్రధాన నిందితుడు ఉప్పరి వెంకట్ కోసం పోలీసుల గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.