Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో తెలంగాణ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) మరోసారి తన దూకుడును ప్రదర్శిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే పలువురిని విచారించిన సిట్, నేడు ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ను ప్రభాకర్ రావును మళ్లీ విచారణకు పిలిపించింది. ఉదయం 11 గంటలకు ఆయన సిట్ ఎదుట హాజరు కానున్నారు. నిన్న ఉదయం నుండి రాత్రి వరకు ఎనిమిది గంటల పాటు మాజీ ఇంటలిజెన్స్ అధికారి ప్రణీత్ రావును ప్రశ్నించిన సిట్, ఆయన , ఇతర సాక్షుల స్టేట్‌మెంట్‌ల ఆధారంగా ఈరోజు ప్రభాకర్ రావును కూడా కఠినంగా విచారించనుంది. సిట్ ప్రస్తుతం నిందితుల విచారణతో పాటు, సంబంధిత సాక్షుల వాంగ్మూలాలను సేకరించడంలో కూడా శ్రద్ధ పెట్టింది.
Ahmedabad Plane Crash: కేంద్రం కీలక నిర్ణయం.. కొత్త నిబంధనలు జారీ
ఫోన్ ట్యాపింగ్ అనుమతులపై సమగ్రంగా దర్యాప్తు చేస్తున్న సిట్, ఈ వ్యవహారంలో కీలకమైన రివ్యూ కమిటీ సభ్యుల నుండి వివరాలు తీసుకుంటోంది. ఈ కమిటీలో హోంశాఖ మాజీ సెక్రటరీ, ప్రస్తుత డీజీపీ జితేందర్, మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ అనిల్ ఉన్నారు. వీరిద్దరి నుండి సిట్ ఇప్పటికే వివరాలు సేకరించినట్టు సమాచారం. ఇంకా, ఫోన్ ట్యాపింగ్ కోసం టెలికాం సర్వీసులకి పంపిన నెంబర్లపై కూడా దర్యాప్తు కొనసాగుతోంది. ప్రభాకర్ రావు టీమ్ అప్పట్లో “మావోయిస్టుల సానుభూతిపరులు” అంటూ కొన్ని ఫోన్ నెంబర్లను ట్యాపింగ్‌కు సిఫారసు చేసినట్టు సమాచారం. వాటిపై అనుమతులు ఎలా ఇచ్చారు? డిజిపి జితేందర్ , అనిల్ ఇచ్చిన వివరాల మేరకు ఆ స్టేట్‌మెంట్‌లను ధృవీకరించేందుకు ఈరోజు విచారణ కీలకంగా మారింది.
ఇక, పదవీ విరమణ పొందిన తర్వాత ఓఎస్డీగా కొనసాగుతున్న ప్రభాకర్ రావును ఫోన్ లీగల్ ఇంటర్‌సెప్షన్‌కు డిసిగ్నేటెడ్ అథారిటీగా ఎలా నియమించారన్న అంశంపైనా సిట్ ఆరా తీస్తోంది. చట్టం ప్రకారం, డిసిగ్నేటెడ్ అథారిటీకి కేవలం 7 రోజులు మాత్రమే అనుమానిత నెంబర్లపై నిఘా పెట్టే అధికారం ఉంటుందన్న నిబంధన నేపథ్యంలో, ఎంతమేరకు ఈ అధికారం దుర్వినియోగమైంది అనే అంశంపై సిట్ దృష్టిసారించింది. ఈ మొత్తం దర్యాప్తులో ప్రభాకర్ రావు, ప్రణీత్ రావుల స్టేట్‌మెంట్లు కీలకంగా మారనున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టించగా, సిట్ దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ మరిన్ని షాకింగ్ వివరాలు వెలుగులోకి వస్తున్నాయి.