Rajanna Siricilla Medical College: ఈ ఏడాది 9 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ సంకల్పంలో మరో అడుగు పడింది. రాజన్న సిరిసిల్ల జిల్లా మెడికల్ కాలేజీకి నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) అనుమతి ఇచ్చింది. దీంతో మరో వంద ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాలకు ఈ విద్యా సంవత్సరం నుంచి తరగతుల నిర్వహణకు అనుమతి లభించింది. గతేడాది 8, ఈ ఒక్క ఏడాదిలో 9 మెడికల్ కాలేజీలు ప్రారంభించాలనేది సీఎం కేసీఆర్ ధ్యేయం. జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు దిశగా వేగంగా తెలంగాణ సర్కార్ అడుగులు వేస్తోంది. రాజన్న సిరిసిల్ల మెడికల్ కాలేజీకి అనుమతి రావడంతో మంత్రి హరీశ్ రావు హర్షం వ్యక్తం చేశారు. వంద ఎంబీబీఎస్ సీట్లకు ఆమోదం లభించినందుకు సంతోషంగా ఉందన్నారు. ఇప్పటి వరకు ఏడు కాలేజీలకు అనుమతి వచ్చిందన్నారు. ఆరోగ్య తెలంగాణలో భాగంగా జిల్లాకో మెడికల్ కాలేజీతో సీఎం కేసీఆర్ ఆశయం విజయవంతంగా ముందుకు సాగుతోందన్నారు.
2023-24 విద్యా సంవత్సరం నుంచి 100 ఎంబీబీఎస్ విద్యార్థుల వార్షిక ప్రవేశంతో మెడికల్ కాలేజీని ప్రారంభించడానికి అనుమతిని ఇస్తూ.. ఎన్‌ఎంసీ మార్గదర్శకాలను అనుసరించడం ద్వారా అవసరమైన బోధనా సిబ్బందిని. ప్రాథమిక సౌకర్యాలను నియమించాలని కోరింది. జిల్లా వైద్య కళాశాల కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, వరంగల్ పరిధిలో పనిచేస్తుంది.
Read Also: KTR: మంత్రి కేటీఆర్‌కు మరో అంతర్జాతీయ కార్యక్రమం నుంచి ఆహ్వానం
అనుమతి లభించినందుకు సంతోషం వ్యక్తం చేసిన స్థానిక ఎమ్మెల్యే, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావుకు సిరిసిల్ల ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు.స్థానిక ప్రజలకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నందున సిరిసిల్ల ప్రజలు ముఖ్యమంత్రికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు తెలుపుతుంటారని ఆయన అన్నారు. జిల్లా ప్రజలపై ప్రత్యేక అభిమానంతో చంద్రశేఖర్‌రావు జిల్లా కేంద్ర ఆసుపత్రిని 300 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేయడంతో పాటు జిల్లాకు వైద్య కళాశాలను మంజూరు చేశారు. మరోవైపు శాశ్వత వైద్య కళాశాల భవన నిర్మాణం శరవేగంగా సాగుతోంది.