US Police Firing: అగ్రరాజ్యం అమెరికాలో ఓ సిక్కు యువకుడిని పోలీసులు కాల్చి చంపారు. ఈసందర్భంగా లాస్ ఏంజిల్స్ పోలీసులు మాట్లాడుతూ.. గురుప్రీత్ సింగ్ (36) అనే వ్యక్తిని కాల్చి చంపినట్లు తెలిపారు. ఆయన సాంప్రదాయ సిక్కు యుద్ధ కళ ‘గట్కా’ను రోడ్డుపై ప్రదర్శిస్తున్నాడు. నగరంలోని క్రిప్టో. కామ్ అరీనా సమీపంలో ఆయన గొడ్డలితో తిరుగుతున్నాడని స్థానికుల నుంచి సమాచారం రావడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అనంతరం పోలీసులు ఆయనతో మాట్లాడటానికి ప్రయత్నించగా మాట వినడానికి నిరాకరించడంతో పాటు, వారిపై దాడి చేయడానికి ప్రయత్నించినప్పుడు అతనిపై కాల్పులు జరిపినట్లు వెల్లడించారు. ఈ సంఘటన జూలై 13న జరిగింది. తాజాగా దీనిపై లాస్ ఏంజిల్స్ పోలీసులు స్పందించారు.
READ ALSO: Rushikonda Resorts: రుషికొండ రిసార్ట్‌ల అంశంపై కేబినెట్ సబ్ కమిటీ!
స్థానికుల నుంచి అనేక కాల్స్…
లాస్ ఏంజిల్స్ పోలీస్ డిపార్ట్మెంట్ నంబర్ 911కు అనేక కాల్స్ వచ్చాయి. ఫిగ్యురోవా స్ట్రీట్, ఒలింపిక్ బౌలేవార్డ్ రద్దీగా ఉండే కూడలి వద్ద పాదచారులపై ఒక వ్యక్తి పెద్ద గొడ్డలితో భయపెడుతున్నట్లు స్థానికుల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. దీంతో పోలీసులు అక్కడికి వెళ్లగానే సింగ్ తన వాహనాన్ని రోడ్డు మధ్యలో వదిలేసి, పారిపోవడానికి ప్రయత్నించాడని తెలిపారు. సింగ్‌ను తన ఆయుధాన్ని కింద పడేయమని పదేపదే ఆదేశించిన ఆయన తమ మాట వినలేదన్నారు.
తన దగ్గరికి వెళ్లినప్పుడు, ఆయన పోలీసులపై ఒక సీసా విసిరి అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించాడని చెప్పారు. అనంతరం పోలీసుల నుంచి తప్పించుకొని ఇష్టారీతిన కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ చివరికి, మరొక పోలీసు వాహనాన్ని ఢీకొట్టి, ఫిగ్యురోవా 12వ వీధి సమీపంలో ఆగిపోయాడని చెప్పారు. తరువాత ఆయన తన దగ్గర ఉన్న కత్తితో దాడి చేయడంతో అతనిపై కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలం నుంచి రెండు అడుగుల పొడవున్న కత్తిని స్వాధీనం చేసుకుని, దానిని సాక్ష్యంగా చేర్చినట్లు తెలిపారు. సింగ్‌ను ఆసుపత్రికి తరలించగా, బుల్లెట్ గాయాలతో చికిత్స పొందుతూ మరణించారని పోలీసులు పేర్కొన్నారు. ఈ సంఘటనలో ఏ అధికారి, పౌరుడు గాయపడలేదన్నారు. ప్రస్తుతం ఘటనపై దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు.
READ ALSO: PACL Scam: 10 రాష్ట్రాల్లో బ్రాంచులు.. రూ.49 వేల కోట్ల కుంభకోణం… కంపెనీ డైరెక్టర్ అరెస్ట్..