Sidhu Moosewala Mother: దాదాపు రెండేళ్ల కిందట దుండగులు జరిపిన కాల్పుల్లో ప్రముఖ పంజాబీ గాయకుడు, కాంగ్రెస్ నేత సిద్దూ మూసేవాలా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. పంజాబ్‌తో పాటు దేశవిదేశాల్లో అభిమానులను సంపాదించుకున్న 28 ఏళ్ల సింగర్ హత్య అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆయన అభిమానులు వీధుల్లోకి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టి.. హంతకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సిద్ధూ మూసేవాలా అలియాస్ శుభ్ దీప్ సింగ్ తల్లిదండ్రులు మరోసారి తల్లిదండ్రులయ్యారు. ఉన్న ఒక్క కొడుకు దారుణ హత్యకు గురవడంతో సిద్ధూ తల్లి 58 ఏళ్ల చరణ్ కౌర్ ఐవీఎఫ్ ద్వారా గర్భం దాల్చి తాజాగా పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.
Read Also: Carrots : పచ్చి క్యారెట్ లను ఎక్కువగా తింటున్నారా? ఇది మీకోసమే..
దివంగత పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా తల్లి చరణ్ కౌర్ మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని స్వయంగా సిద్ధూ తండ్రి బాల్కౌర్ సింగ్ సోషల్ మీడియాలో ద్వారా వెల్లడించారు. అలాగే ఆ చిన్నారి ఫొటోను కూడా షేర్ చేస్తూ సిద్ధూ తమ్ముడిని ఆశీర్వదించాలని పోస్ట్ చేశారు. 58ఏళ్ల వయసులో బిడ్డకు జన్మనిచ్చారు సిద్దు తల్లి. ఒడిలో పసికందుతో బాల్కౌర్ సింగ్ పోస్టు చేసిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దేవుడి దయ, సిద్ధూ అభిమానుల ఆశీస్సులు, శ్రేయోభిలాషుల దీవెనలతో తమకు కొడుకు పుట్టాడని తన ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారని వెల్లడించారు. సిద్దూ మూసేవాలా ఫొటో పక్కన ఒడిలో బాబుతో ఉన్న ఈ ఫొటో ప్రస్తుతం వైరల్‌గా మారింది. దీంతో సిద్ధూ అభిమానులు సంతోషంగా కామెంట్లు పెడుతున్నారు. సిద్ధూ భాయ్ మళ్లీ వచ్చాడంటూ సంబరపడుతున్నారు.