Sidharth Malhotra and Kartik Aaryan to perform in WPL 2024 Opening Ceremony: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2వ ఎడిషన్ కౌంట్ డౌన్ ప్రారంభమైంది. డబ్ల్యూపీఎల్ రెండో సీజన్ ఫిబ్రవరి 23న బెంగళూరులో ఆరంభం కానుంది. టోర్నీ మొదటి మ్యాచ్ బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్, రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు బీసీసీఐ ప్రారంభ వేడుకను నిర్వహించనుంది. ఈ వేడుకకు బాలీవుడ్ హీరోలు ముఖ్య అతిథులుగా వస్తున్నారు.
బాలీవుడ్ యువ హీరోలు సిద్ధార్థ్ మల్హోత్రా, కార్తీక్ ఆర్యన్‌లు డబ్ల్యూపీఎల్ 2024 ప్రారంభ వేడుకలో పాల్గొననున్నారు. ఈ విషయాన్ని ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పేర్కొంది. ఈ ప్రారంభ వేడుక బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో శుక్రవారం సాయంత్రం 6:30 గంటలకు ఆరంభం అవుతుంది. వీరితో పాటు మరికొందరు స్టార్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. జియో సినిమా, స్పోర్ట్స్ 18లో ప్రారంభ వేడుక సహా మ్యాచ్ ప్రసారం అవుతుంది. కియారా అద్వానీ, కృతి సనన్.. డబ్ల్యూపీఎల్ గతేడాది ప్రారంభ వేడుకలో మెరిసిన విషయం తెలిసిందే.
Also Read: Nothing Phone 2a Launch: భారత మార్కెట్‌లోకి ‘నథింగ్ ఫోన్ 2ఏ’.. ధర, ఫీచర్స్ ఇవే!
డబ్ల్యూపీఎల్ 2024 ఫిబ్రవరి 23 నుంచి మార్చి 17 వరకు జరగనుంది. గతేడాది మాదిరిగానే మొత్తం ఐదు టీమ్స్ 22 మ్యాచ్‌లు ఆడనున్నాయి.రెండో సీజన్‌లో రెండు నగరాలు ఆతిథ్యం ఇస్తున్నాయి. బెంగళూరు లెగ్ మార్చి 4 వరకు కొనసాగుతుంది. తర్వాత ఢిల్లీకి టోర్నీ తరలిపోతుంది. ఈ సీజన్‌లో మ్యాచ్‌లు 24 రోజులు జరగనుండగా.. డబుల్ హెడర్‌లు మాత్రం లేవు. టోర్నీలో అన్ని మ్యాచ్‌లు రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతాయి. మార్చి 15న ఎలిమినేటర్ మ్యాచ్, 17న ఫైనల్ మ్యాచ్ ఢిల్లీలో జరగనున్నాయి. లీగ్ రౌండ్‌లో 20 మ్యాచ్‌లు జరగనుండగా.. అగ్రస్థానంలో నిలిచిన జట్టు నేరుగా ఫైనల్స్‌లోకి ప్రవేశిస్తుంది. రెండు, మూడు స్థానాల్లో నిలిచిన జట్లు ఎలిమినేటర్ మ్యాచ్ ఆడతాయి.గతేడాది హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని ముంబై చాంపియిన్‌గా నిలిచింది. ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, యూపీ వారియర్స్, గుజరాత్ జెయింట్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు టైటిలో కోసం పోటీ పడనున్నాయి.