కర్ణాటకలో ‘పవర్ షేరింగ్’ వివాదం ఇంకా సద్దుమణగలేదు. ట్విస్టులు.. మీద ట్విస్టులు నడుస్తున్నాయి. ప్రస్తుతం ‘బ్రేక్‌ఫాస్ట్’ పాలిటిక్స్ సాగుతున్నాయి. అయితే ఈ అల్పాహారం రాజకీయాల వెనుక చాలా కథనే ఉందని విశ్లేషకులు అంటున్నారు.
చాలా రోజులు హస్తిన వేదికగా హైకమాండ్‌తో చర్చలు జరిగాయి. అనంతరం కర్ణాటకకు షిప్ట్ అయింది. గత శనివారం సిద్ధరామయ్య ఇంట్లో డీకే.శివకుమార్‌కు అల్పాహారం విందు ఇవ్వగా.. మంగళవారం డీకే.శివకుమార్ ఇంట్లో సిద్ధరామయ్యకు బ్రేక్‌ఫాస్ట్ ఇచ్చారు. అనంతరం సిద్ధరామయ్య మీడియాతో మాట్లాడుతూ.. తమ మధ్య విభేదాలు లేవని.. డిసెంబర్ 8 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో వ్యూహ రచనపై చర్చించినట్లుగా తెలిపారు. చివరిగా హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్న దానికి కట్టుబడి ఉంటానని చెప్పారు. ఈ వ్యాఖ్యతో సిద్ధరామయ్య మెట్టు దిగినట్లుగా భావిస్తున్నారు.
అయితే ‘పవర్ షేరింగ్’లో భాగంగా డీకే.శివకుమార్‌కు అధిష్టానం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అధికార మార్పిడి అనేది చాలా సున్నితమైన అంశం కాబట్టి చాలా చాకచక్యంగా హైకమాండ్ వ్యవహరిస్తున్నట్లుగా తెలుస్తోంది. సిద్ధరామయ్య వయసులో పెద్ద వారు కావడం.. ఎంతో రాజకీయ అనుభవం కలిగి ఉండడంతో ఒకేసారి పదవి నుంచి దింపకుండా చాలా జాగ్రత్తగా ఈ వ్యవహారాన్ని అధిష్టానం నడిపిస్తున్నట్లుగా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇక ఇందులో భాగంగానే బుధవారం సిద్ధరామయ్యతో కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ.వేణుగోపాల్ సమావేశం అవుతున్నారు. ఈ భేటీ తర్వాత ‘పవర్ షేరింగ్’పై ఒక క్లారిటీ రావొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి.