సార్వత్రిక ఎన్నికల వేళ చిత్ర, విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. అన్ని పార్టీల నేతలు ఆయా రకాలుగా ప్రజలను అభ్యర్థిస్తున్నారు. తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కొత్త పల్లవి అందుకున్నారు. తాను ముఖ్యమంత్రి కొనసాగాలంటే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి భారీ ఆధిక్యం అందించాలని సొంత నియోజకవర్గమైన వరుణ ఓటర్లకు భావోద్వేగపూరితంగా మనవి చేశారు. ఈ వ్యాఖ్యలతో కర్ణాటక కాంగ్రెస్‌లో ఏదో జరుగుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.
2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో స్థానిక కాంగ్రెస్ అభ్యర్థి కేవలం 1,817 ఓట్ల తేడాతో ఓడిపోయారని.. అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం వరుణలో తనకు 48 వేల ఓట్ల మెజారిటీ అందించారని గుర్తుచేశారు. ఇప్పుడు లోక్‌సభ బరిలో కాంగ్రెస్ అభ్యర్థికి 60 వేల ఓట్ల ఆధిక్యం కట్టబెడితే సంతోషిస్తానని తెలిపారు. అదే జరిగితే.. తనను ఎవరూ తాకలేరని చెప్పుకొచ్చారు. తాను ముఖ్యమంత్రిగా ఉండాలా? వద్దా? అనేది మీరందించే ఆధిక్యాన్ని బట్టి ఉంటుందని ఓటర్లనుద్దేశించి సిద్ధరామయ్య ప్రసంగించారు.
వాస్తవానికి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత డీకే.శివకుమార్ ముఖ్యమంత్రి అవుతారని ప్రచారం జరిగింది. కానీ చివరికి సిద్ధరామయ్య ఆ పీఠంపై కూర్చున్నారు. సీనియార్టీకే ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిసింది. తాజాగా ఎన్నికల ప్రచారం సందర్భంగా సిద్ధరామయ్య స్వరం మారింది. లోక్‌సభ ఎన్నికల తర్వాత ఏమైనా మార్పులు జరగొచ్చా? అన్న అనుమానం కల్గుతుంది. మరీ ఏం జరుగుతుందో వేచి చూడాలి.
దేశవ్యాప్తంగా ఏడు విడతల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఆ తర్వాత ఏప్రిల్ 26, మే 7, మే 13, మే 20, మే 25 మరియు జూన్ 1న తదుపరి ఎన్నికలు జరుగుతాయి. ఓట్ల లెక్కింపు జూన్ 4న జరుగుతుంది.