టీమిండియా నయా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. భారత టెస్ట్ జట్టుకు నాయకత్వం వహించినప్పటి నుంచి ఈ పంజాబ్ ఆటగాడు పరుగుల వరద పారిస్తున్నాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న సిరీస్‌లోని మొదటి రెండు టెస్ట్ మ్యాచ్‌లలో 585 పరుగులు చేశాడు. లార్డ్స్ మైదానంలో జరుగుతున్న మూడో టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో 16 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. 9 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఉన్నపుడు గిల్ సరికొత్త చరిత్ర సృష్టించాడు.
ఇంగ్లండ్ గడ్డపై ఓ టెస్ట్ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ నిలిచాడు. అంతకుముందు ఈ రికార్డు కింగ్ విరాట్ కోహ్లీ పేరుపై ఉంది. 2018 ఇంగ్లండ్ పర్యటనలో కోహ్లీ ఐదు మ్యాచ్‌లు ఆడి 593 పరుగులు చేశాడు. కోహ్లీ రికార్డును గిల్ బద్దలు కొట్టాడు. టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీ ట్రోఫీలో ఐదు ఇన్నింగ్స్‌లు ఆడిన గిల్ 601 పరుగులు చేశాడు. ఇంగ్లండ్ గడ్డ మీద ఓ టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆసియా కెప్టెన్‌గా గిల్ మరో రికార్డు సాధించాడు. అంతకుముందు ఈ రికార్డు కూడా కోహ్లీ పేరిటే ఉంది. ఆసియా కెప్టెన్ జాబితాలో మహ్మద్ అజారుద్దీన్ (426), జావేద్ మియాందాద్ (364), సౌరవ్ గంగూలీ (351) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
Also Read: KA Paul: నా కొడుకు అమెరికా ప్రెసిడెంట్ అవ్వాలి.. కేఏ పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ఇంగ్లండ్ గడ్డపై భారత్ తరపున టెస్ట్ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు రాహుల్ ద్రవిడ్ పేరుపై ఉంది. 2002లో ఇంగ్లండ్‌లో భారత పర్యటన సందర్భంగా ద్రవిడ్ నాలుగు మ్యాచ్‌ల్లో 602 పరుగులు చేశాడు. అప్పుడు సౌరవ్ గంగూలీ భారత జట్టుకు నాయకత్వం వహించాడు. శుభ్‌మన్ గిల్ ఒక పరుగు మాత్రమే దూరంలో ఉన్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో ద్రవిడ్ రికార్డును గిల్ బద్దలు కొట్టనున్నాడు. ఇంకా రెండు టెస్టులు ఉన్న నేపథ్యంలో గిల్ మరిన్ని రన్స్ చేసే అవకాశం కూడా ఉంది. భారత్ తరపున ఓ టెస్ట్ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు యశస్వి జైస్వాల్ పేరిట ఉంది. 2024లో జైస్వాల్ ఐదు మ్యాచ్‌ల్లో 712 పరుగులు చేశాడు. 2016లో కోహ్లీ 655 రన్స్ బాదాడు. మరి ఈ రికార్డును గిల్ బ్రేక్ చేస్తాడో లేదో చూడాలి.